https://oktelugu.com/

Fengal Cyclone: ఫెంగల్ తుఫాన్ తో తమిళనాడు అతలాకుతలం.. భయానకం గా వరద.. కొట్టుకుపోతున్న వాహనాలు.. వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని రాయలసీమ, నెల్లూరు జిల్లాలను వణికించింది. కనివిని ఎరుగని స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 2, 2024 / 01:07 PM IST

    Fengal Cyclone(3)

    Follow us on

    Fengal Cyclone: ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి ప్రాంతంలో శనివారం రాత్రి తీరం దాటింది. దీని ప్రభావం వల్ల తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా క్రిష్ణగిరి జిల్లాలో గడచిన 24 గంటల్లో 500mm వర్షపాతం నమోదయింది. ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా కురిసిన వర్షం వల్ల వరద నీరు పోటెత్తింది. దీంతో ఊతంగరై ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన నిలిపి ఉన్న వాహనాలను వరద నీరు ముంచెత్తింది. వరద నీరు అమాంతం రావడంతో వాహనాలు మొత్తం కొట్టుకుపోయాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ దృశ్యాలను బట్టి తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు ఏ స్థాయిలో కురుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు అంటున్నారు.. శుక్రవారం నుంచి తమిళనాడు రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరి ప్రాంతంలో తీరం దాటినప్పటికీ వర్షాలు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఫెంగల్ తుఫాన్ ప్రభావం వల్ల నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద సముద్రం ఏకంగా 20 అడుగుల ముందుకు వచ్చింది. దీంతో ఏపీలోని అన్ని నౌకాశ్రయాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. జాలర్లు వేటకు వెళ్లొద్దని అధికారులు ముందస్తుగానే సూచనలు చేశారు. మహాబలిపురం – కరైకల్ వద్ద తీరం దాటినప్పటికీ.. తుఫాను నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతోంది. ఫలితంగా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.

    వాయుగుండం గా మారే అవకాశం

    తుఫాను తీరం దాటినప్పటికీ వాయుగుణంగా మారే అవకాశం కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరిస్తున్నారు. తుఫాను ప్రభావం వల్ల మంగళవారం కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఏపీలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.. తుఫాను ప్రభావం తగ్గకపోవడంతో కృష్ణపట్నం నౌకాశ్రయంలో ఆరో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, వాడరేవు, మచిలీపట్నం నౌకాశ్రయాలలో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావం వల్ల పలు ప్రాంతాలలో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఫలితంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడంతో విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. వరద నీరు ముంచేట్టడంతో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయం ఆఫ్రాన్ ను మూసివేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో తిరుమలలో శ్రీవారి పాదాలు, పాప వినాశనం వెళ్లే మార్గాలను బారి కేడ్ లతో మూసివేశారు. గత 34 గంటల్లో తమిళనాడులో ఫెంగల్ తుఫాన్ వల్ల 20 నుంచి 27 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయింది.