Tamil Nadu Governor Vs TVK Vijay: తమిళనాడు ఎన్నికల ఫలితాలలో టీవీకే అత్యధిక స్థానాలు సాధించింది. కానీ, గవర్నర్ విజయ్ ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు.. మెజారిటీ కి సరిపడా ఎమ్మెల్యేల మొదట తీసుకొని రావాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ సూచించారు. దీనిపై అనేక రకాలుగా విమర్శలు వస్తున్నాయి.. గవర్నర్ తీసుకున్న నిర్ణయం పట్ల కొంతమంది విశ్లేషకులు మరో విధంగా చెబుతున్నారు. గవర్నర్ ముందు జాగ్రత్త తీసుకున్నారని అంటున్నారు.
మనదేశంలో గతంలో అనేక రాష్ట్రాలలో గవర్నర్ల సూచన మేరకు కొన్ని ప్రభుత్వాలు హడావిడిగా ఏర్పాటయ్యాయి. విశ్వాస పరీక్ష ఎదుర్కోవడంలో విఫలమయ్యాయి. 1996లో కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం 13 రోజులు మాత్రమే ఉంది. అలాంటి ఘటనలు దేశానికి మంచివి కావని భావించి.. ప్రభుత్వాల ఏర్పాట్లు గవర్నర్లు సరైన విధానంలో వ్యవహరించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. “ఎస్ఆర్ బొమ్మై” కేసులో మనదేశ సర్వోన్నత న్యాయస్థానం అనేక మార్గదర్శకాలు జారీ చేసింది.. అప్పట్లో సర్కారియా, పూంచి కమిషన్లు అనేక సూచనలు చేశారు. నాడు సుప్రీంకోర్టు వాటిని సమర్థించింది కూడా.
కచ్చితంగా పాటించాల్సిందే
సుప్రీంకోర్టు సమర్ధించిన సర్కారియా, పూంచి కమిషన్లు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వాల ఏర్పాటు విషయంలో గవర్నర్లు ప్రాధాన్యతను పాటించాల్సి ఉంటుంది. ఎక్కువ స్థానాలకు వచ్చిన కూటమికి ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలవాలి.. ఒకవేళ ముందుగా ఏర్పడిన కూటమికి మెజారిటీ రాకపోతే.. ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి. ఒకవేళ అనేక పార్టీలు కూటమిగా ఏర్పడి.. మెజార్టీ ఉందని చూపిస్తే.. వాళ్లను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవవచ్చు.
ఒకవేళ ప్రభుత్వంలో భాగంగాక పోయినప్పటికీ.. బయటనుంచి మద్దతు పలికే పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటే దానిని పరిశీలించవచ్చు.
ఒకవేళ ఏ పార్టీ కూడా మెజారిటీ అందుకోలేని పక్షంలో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేనప్పుడు.. గవర్నర్ రాజ్యాంగం 356 ప్రకారం రాష్ట్రపతి పరిపాలనకు సిఫారసు చేసేందుకు అవకాశం ఉంటుంది.
సపోర్ట్ చేస్తున్న పార్టీల నుంచి ఎమ్మెల్యేల సంతకాలు చేసిన లేఖలను గవర్నర్ తీసుకోవాలని.. ఆయన స్వయంగా ధ్రువీకరించుకోవాలని పూంచి కమిషన్ స్పష్టంగా చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఎక్కువ సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు.. అప్పటికే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన మెజారిటీ.. ఈ అంశాల మీద ఎట్టి పరిస్థితుల్లో రాజ్ భవన్ లో నిర్ణయాలు సాధ్యం కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. కేవలం అసెంబ్లీలో మాత్రమే పార్టీలు బల నిరూపణ చేసుకోవాలని సూచించింది. గవర్నర్ ఒక నిర్ణయానికి రావడానికి అంటే ముందు ఎమ్మెల్యే సంతకాలు పరిగణలోకి తీసుకోవద్దని.. అసెంబ్లీలో ఓటింగ్ ను మాత్రమే చూడాలని సూచించింది. కర్ణాటకలో బొమ్మై ప్రభుత్వాన్ని నాటి గవర్నర్ వెంకటసుబ్బయ్య.. మెజారిటీ లేదని రద్దు చేశారు. ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కేసును విచారించిన సుప్రీంకోర్టు పై అంశాలను పేర్కొంది.