CM Stalin- Student Nandini
CM Stalin- Student Nandini: ‘600కు 600 మార్కులా? ఆశ్చర్యంగా ఉంది. నీలాంటి వారే తమిళనాడు చిహ్నాలు’ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ విద్యార్థినిని ఉద్దేశించి కొనియాడారు. మంగళవారం ఏకంగా ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులను తన క్యాంపు కార్యాలయంలోకి పిలిపించుకుని అభినందించారు. భవిష్యత్‌లో ఎలాంటి సహాయం కావాలన్నా అడగాలని తన ఫోన్ నంబరు ఇచ్చారు. ఆ విద్యార్థినితో గడిపిన సమయాన్ని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఇంతకీ తమిళనాడు ముఖ్యమంత్రిని అంతగా కదిలించిన ఆ విద్యార్థిని ఎవరు? ఆమె ఎందులో ఘనత సాధించిందో మీరూ చదివేయండి.
600కు 600 సాధించింది
తమిళనాడు రాష్ట్రం దిండిగల్లుకు చెందిన నందిని స్థానిక అన్నామలైయార్ మిల్స్ పాఠశాలలో ప్లస్2 చదివింది. ఈమె తండ్రి ఓ కార్పేంటర్. ఇటీవల ఆ రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో నందిని ఏకంగా 600కు ఆరు వందలు మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. పేద కుటుంబానికి చెందిన నందిని ఈ స్థాయిలో మార్కులు సాధించడంతో ఆమెను అభినందనలు ముంచెత్తాయి. నందిని తమిళ్, ఇంగ్లీష్, అకౌంటెన్సీ, ఎకనమిక్స్, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్‌లో నూటికి నూరు మార్కులు సాధించింది.
ముఖ్యమంత్రి ఫోన్ చేశారు
నందిని ఆరువందలకు 600 మార్కులు సాధించడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఉబ్బితబ్బిబయిపోయారు. వెంటనే నందినికి ఫోన్ చేసి అభినందించారు. ఆమె కుటుంబ వివరాలు కనుక్కున్నారు. ‘నాది పేద కుటుంబం. తండ్రి కార్పేంటర్‌గా పని చేస్తాడు. నేను కష్టపడి చదివాను. చదువు ఎవరూ దొంగతనం చేయలేని ఆస్తి’ అని చెప్పడంతో ఉద్వేగానికి గురయ్యారు. వెంటనే మరుసటి రోజు తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఆమె ఉన్నత చదువులకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం ద్వారా భరిస్తుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత నందిని విలేకరులతో మాట్లాడింది. ముఖ్యమంత్రి తనకు బహుమతులు ఇచ్చారని ఉబ్బితబ్బిబయింది. భవిష్యత్‌లో తాను ఆడిటర్ కావాలనుకుంటున్నట్టు వెల్లడించింది.