
గడిచిన పదిరోజులు దేశంలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. ఒక్కరోజులో పదివేలకు పైగా కరోనా నమోదువుతన్నాయి. ఇప్పటికే భారత్ కరోనా కేసుల్లో ఇటలీని దాటేసింది. మూడులక్షల కేసుల మార్కును భారత్ ఇటీవలే అధిగమించింది. దీంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది. దీంతో ప్రధాని మోడీ మరోసారి ఆయా రాష్ట్రాల సీఎంలో భేటి అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. లాక్‌డౌన్ కొనసాగించాలా? లేక పూర్తిగా ఎత్తేయాలా? అనే అంశాన్ని సీఎంలతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ విధించడం చర్చనీయాంశంగా మారింది. దేశంలోని నాలుగైదు రాష్ట్రాల్లోనే దాదాపు సగానికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయి. కరోనా నివారణకు తమిళనాడు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన కట్టడి కావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా కేసులు ఎక్కువగా నమోదువుతున్న చెన్నై మెట్రో పాలిటన్ నగర పరిధిలోని నాలుగు జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమైంది. జూన్ 19నుంచి 30వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు.
ఈమేరకు తమిళనాడు రాష్ట్ర కేబినెట్ సోమవారం నిర్ణయం తీసుకుంది. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో పూర్తిగా లాక్‌డౌన్ ఉంటుందని ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఉదయం 6గంటల నుంచి 2గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆదివారాల్లో ప్రజలెవరినీ బయటకు అనుమతించవద్దని సూచించింది. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిల్ సేవలకు మాత్రమే అనుమనిచ్చింది. 33శాతం ఉద్యోగులతోనే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలను జారీ చేసింది.
ఈనేపథ్యంలోనే తెలంగాణలోనూ లాక్‌డౌన్ అమలు చేస్తారా? అనే చర్చ నడుస్తోంది. తెలంగాణలోని జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు గడిచిన పదిరోజులుగా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ కొన్ని సడలింపులు ఉన్నాయి. దీంతో కరోనా కట్టడి అవడంలేదని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారవాణా, అన్ని కార్యకలాపాలు ఈ ప్రాంతాల్లోనూ జరుగుతుండటంతో కేసుల సంఖ్య పెరుగుతూ పోతుందని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం మరోసారి చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు తెల్సింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తలసాని మాత్రం మరోసారి లాక్‌డౌన్ ఉందబోదని స్పష్టం చేశారు. అయితే తాజాగా తమిళనాడు రాష్ట్రం మరోసారి లాక్‌డౌన్ విధించడంతో తెలంగాణలోనూ లాక్‌డౌన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. లాక్‌డౌన్ పై సీఎం కేసీఆర్ మున్ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!