MLA Sridevi Love Story : రాష్ట్రంలో వైసిపి రెబల్ ఎమ్మెల్యేల గురించి జోరుగా చర్చ నడుస్తోంది. మరీ ముఖ్యంగా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గురించి ఏది మాట్లాడిన హాట్ టాపిక్ గా కనిపిస్తోంది. మీడియా అంతా ఆమె చుట్టే తిరుగుతోంది. వైసీపీ అగ్ర నాయకులపై తీవ్ర విమర్శలు చేసిన తర్వాత.. ఆమెపై మీడియా ఎక్కువగా దృష్టి సారించింది. పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నుంచి ఆమె మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే ఆమె పలు మీడియా ఛానల్ తో మాట్లాడుతూ తన వ్యక్తిగత, వృత్తి గత జీవితాల గురించి అనేక విషయాలను వెల్లడించారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడిందన్న ఆరోపణలు నేపథ్యంలో వైసిపి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత శ్రీదేవి హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టి వైసిపి నాయకుల అవినీతి చిట్టాను విప్పారు. ఇక వైసిపి నేతలు కూడా శ్రీదేవి అవినీతికి పాల్పడిందంటూ ఆమెను సోషల్ మీడియా వేదికగా టోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఉండవల్లి శ్రీదేవి కూడా వరుసగా మీడియాలో ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన వెర్షన్ కూడా చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో ఆమె కుటుంబం గురించి, పెళ్లి గురించి అనేక విషయాలను బయటకు వెల్లడించారు.
ప్రేమ వివాహం.. ఎలా జరిగిందంటే..
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆమె భర్త శ్రీధర్.. ఇద్దరూ వైద్యులు. వీరిద్దరూ హైదరాబాదులో వైద్య వృత్తిలో ఉండగా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ వివాహాన్ని గురించి చెప్పుకొచ్చారు. తమది ప్రేమ వివాహంగా ఆమె వెల్లడించారు. హైదరాబాదులో గైనకాలజిస్ట్ గా పని చేస్తూ రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు శ్రీదేవి. భర్త డాక్టర్ శ్రీధర్ కూడా ప్రముఖ యూరాలజిస్ట్. వీళ్ళిద్దరూ పీజీ చేస్తున్న సమయంలో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ప్రేమ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే శ్రీదేవి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. శ్రీధర్ తనకంటే సీనియర్. అందులోనూ టాపర్ గా ఉంటూ గోల్డ్ మెడలిస్ట్ కావడంతో చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చే వారని, అలా పరిచయం తర్వాత ప్రేమ వివాహానికి దారి తీసింది అని చెప్పారు. పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లినట్లు ఆమె పేర్కొన్నారు. ఇద్దరం ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పినప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పలేదని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్.. తొలుత శ్రీదేవి ప్రేమ అంటూ వెంట పడిన విషయాన్నీ వెల్లడించారు. ముందు శ్రీదేవి ప్రపోజ్ చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
కుల విషయాన్ని పట్టించుకోని కుటుంబాలు..
డాక్టర్ శ్రీధర్ కాపు అని.. తాను ఎస్సీ అని తెలిసినప్పటికీ పెళ్లి విషయములో అభ్యంతరం చెప్పలేదని ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పారు. పొలానికి సంబంధించిన భేదాలు కుటుంబంలో ఎప్పుడు రాలేదన్నారు. రాజకీయాలకు వచ్చాక ఎస్సీ సర్టిఫికెట్ ఎమ్మెల్యే కి పోటీ చేయడం కోసం తీసాను అంటూ ఆమె వెల్లడించారు. ఇరు కుటుంబాల్లోనూ కుల ప్రస్తావన ఇప్పటివరకు రాలేదని, భవిష్యత్తులోనూ రాబోదని ఆమె స్పష్టం చేశారు.
పెద్ద కుమార్తె మెడిసిన్.. చిన్న కుమార్తె ఇంటర్..
తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఎమ్మెల్యే శ్రీదేవి వెల్లడించారు. హైదరాబాదులోనే ఎక్కువగా ఉంటారని తెలిపారు. పెద్ద కూతురు మెడిసిన్ చేస్తుండగా, చిన్న కూతురు ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోందని వెల్లడించారు. పెద్దమ్మాయి బాగా తెలివైనదని, చక్కగా మాట్లాడుతుందని ఎమ్మెల్యే వివరించారు. మెడిసిన్ పూర్తిచేసిన తర్వాత సివిల్స్ కు ప్రిపేర్ కావాలని భావిస్తున్నట్లు ఎమ్మెల్యే తన పెద్ద కుమార్తె గురించి తెలియజేశారు.
ఓటు తర్వాత బాగా పాపులర్ అయిన ఎమ్మెల్యే..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకముందు వరకు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన తర్వాత ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీ హోదా సాధించినట్లు అయింది. మీడియాలో పెద్ద ఎత్తున ఆమె గురించి చూపించడం, సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ తీవ్ర విమర్శలు గుర్తించడంతో.. ఎమ్మెల్యే శ్రీదేవి ఎవరన్న విషయం బాగా చర్చిలోకి వచ్చింది. దీంతో యూట్యూబ్ ఛానల్స్, మిగిలిన చానల్స్ ఆమె ఇంటర్వ్యూలు చేసేందుకు పోటీ పడుతున్నారు. వచ్చిందే అవకాశం అన్నట్టుగా ఆమె కూడా కాదు లేదా అనకుండా వచ్చిన వారికి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. అలా పలు చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆమె కుటుంబం, పెళ్లి జీవితం, చదువు, వృత్తి గురించి అనేక విషయాలను వెల్లడించారు.