
YCP Vs TDP : సత్యసాయి జిల్లా పుట్టపుర్తి రణరంగాన్ని తలపించింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే సవాళ్లు ప్రతి సవాళ్లతో అట్టుడికింది. అవినీతికి పాల్పడింది ఎవరో తేల్చుకుందామని రమ్మంటూ మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అన్న సవాలును స్వీకరించిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీథర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చినికి చినికి గాలివానలా మారి ఇరు పార్టీల నేతలు కొట్టుకునే స్థాయికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇక్కడ టీడీపీ బాగా వీక్ గా ఉంది. మరలా పుంజుకోకపోతే ఇకపై కష్టమేనన్న భావనకు తెలుగుదేశం అధిష్టానం వచ్చినట్లుంది.
అసలేం జరిగింది?
పుట్టపర్తిలో పల్లె రఘనాథరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. గత 2019లో ఇక్కడ వైసీపీ గెలుచుకుంది. శ్రీథర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం నియోజకవర్గంలో తన ముద్ర కనబడేలా ఆధిపత్యం మొదలుపెట్టారు. స్థానిక ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ బాగా బలహీనంగా మారిపోతుంది. పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నాలకు లోకేష్ పర్యటనే వేదికగా మారింది. యువగళం పాదయాత్రగా పుట్టపర్తికి చేరుకున్న సందర్భంలో లోకేష్ స్థానిక ఎమ్మెల్యే శ్రీథర్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు చేశారు. అందుకు స్పందిచిన శ్రీథర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ హయాంలోనే అవినీతి జరిగిందని, తాను ఎక్కడా అవినీతి పాల్పడలేదని పేర్కొన్నారు. అవసరమైతే పుట్టపర్తి సత్తెమ్మ గుడిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకోవడం జరిగిపోయాయి. ఆ తరువాత నియోజకవర్గం రణరంగంగా మారిపోయింది.
దాడులు చేస్తున్నా, లెక్కచేయని ‘పల్లె’
అనుకున్నట్లుగా ప్లాన్ వర్కవుటుంతుండటంతో పల్లె రఘునాథరెడ్డి మరింత జోష్ పెంచారు. పోలీసులు హౌస్ అరెస్టు చేసినా, తప్పించుకొని సత్తెమ్మ తల్లి ఆలయానికి పయనమయ్యారు. అప్పటికే గుంపులు గుంపులుగా చేరుకున్న వైసీపీ శ్రేణులు ఆయన కాన్వాయ్ పై రాళ్లు విసిరారు. పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లినా, నేరుగా ఆయన ఆలయానికి చేరుకొన్నారు. శ్రీథర్ రెడ్డి రావాలని సవాల్ విసిరారు. లోకేష్ ఆరోపణలన్నీ నిజమేనని అన్నారు. ఆధారాలతో నిరూపిస్తానని అన్నారు. దీంతో పోలీసులు ఆయనను చుట్టుముట్టి అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఆరోపించారు. శ్రీథర్ రెడ్డి భూ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
‘పల్లె’ గ్రాఫ్ పెంచుకునేందుకేనా?
రెండు రోజులుగా పుట్టపర్తిలో జరుగుతున్న పరిణమాలపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు తమ బలాబలాలను నిరూపించుకునే పనిలో పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో పల్లె రఘునాథ్ రెడ్డికి టిక్కెట్ కూడా దక్కదేనే ప్రచారం జరిగింది. అసమ్మతి ఎక్కువగా ఉండటంతో గెలుపు కష్టమని రిపోర్టులు అందినా, టీడీపీ ఆయనకే టిక్కెట్ ఇచ్చింది. అనుకన్నట్లుగానే ఓడిపోయారు. ఈసారి ఎన్నికలు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో, నియోజకవర్గంలో టీడీపీని మళ్లీ పుంజుకునేలా చేసేందుకు అధిష్టానం ప్లాన్ వేసినట్లుంది. అందుకు లోకేష్ పర్యటనను ఆధారంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. వర్కవుట్ అయితే, ఈసారి పల్లె రఘనాథ రెడ్డికి టిక్కెట్ ఖాయమయ్యే అవకాశాలు ఉంటాయి. లేకపోతే కొత్త వ్యక్తిని బరిలో దించే ఆలోచనలు ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.