
5 రోజుల తర్వాత శిథిలాల నుంచి సజీవంగా బయటపడ్డ 2 నెలల చిన్నారి
Turkey Earthquake : ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఎవరి ఇళ్లల్లో వారు పనిచేసుకుంటున్నారు. ఉన్నట్టుండి భూమి కంపించినట్టు అనిపించింది. ఆ వెంటనే ఏదో భ్రమలే అనుకున్నారు. ఇంతలో ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. క్షణాల్లో భారీ భవంతులు పేకమేడల్లా కూలిపోయాయి. వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరెన్నో ప్రాణాలు శిథిలాల కింద కొట్టుమిట్టాడుతున్నాయి. ఆపన్నహస్తం కోసం కొన ఊపిరితో ఎదురుచూస్తున్నాయి.
టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం అపార నష్టాన్ని మిగిల్చింది. వేలాది ప్రాణాలను బలితీసుకుంది. రెండు దేశాల్లో కలిపి 28,500 మందికి పైగా ప్రాణాలు కోల్పయినట్టు తెలుస్తోంది. గతంలో ఇరాక్ భూకంపం కూడా ఇదే నష్టాన్ని మిగిల్చింది. అప్పట్లో దాదాపు 31 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. శిథిలాలు తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించి ఇప్పటికే ఐదు రోజులు పూర్తీ అవుతోంది. అయినప్పటికీ పూర్తీస్థాయిలో శిథిలాల తొలగింపు కార్యక్రమం పూర్తీ అవ్వడంలేదు. వేలాది ఇళ్లు నేలమట్టం కావడం, రాత్రిపూట చలి తీవ్రంగా వణికిస్తుండటంతో సహాయ కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయి.
టర్కీ, సిరియా భూకంపం… ఊహించని ప్రాణ, ధన నష్టాన్ని మిగిల్చింది. ఇంతటి విపత్తులో కూడా అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. భూకంపం సంభవించిన 90 గంటల తర్వాత కూడా పదిరోజుల పసికందు ప్రాణాలతో బయటపడ్డాడు. శిథిలాల కింద ఉన్న యాగిజ్ ఉలాస్ అనే పదిరోజుల పసిబిడ్డను, అతని తల్లిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. పిల్లాడిని బయటికి తీసి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఈ రెస్క్యూ చర్యల్లో పాల్గొన్న ఓ సిబ్బంది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అద్భుతాలంటే ఇన్నాళ్లు తాను నమ్మలేదని, ఈరోజు అద్భుతం కళ్ల ముందు ఆవిష్కృతమైందని వ్యాఖ్యానించాడు. నిజంగా పదిరోజుల పసికందు 90 గంటలు నీరు, నిద్ర, తల్లిపాలు లేకుండా .. దుమ్ము, ధూళిలో శిథిలాల కింద ప్రాణాలతో ఉండటం అంటే అద్భుతమే కదా.
అదే హతయ్ ప్రావిన్సుకు చెందిన మరో మూడేళ్ల చిన్నారి జెనెప్ ఎలా పార్లక్ ను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. వంద గంటల తర్వాత కూడా జెనెప్ ప్రాణాలతో బయటపడటం గమనార్హం. ఈ విషయాన్ని టర్కీ మీడియా ఏజెన్సీ అనడోలు వెల్లడించింది. సిరియాకు చెందిన జఖారియా శిథిలాల కింద మురికి నీటి బిందువులను తాగి ప్రాణాలను నిలుపుకున్నాడు. రెస్య్కూ సిబ్బంది సహాయంతో శిథిలాల కింద నుంచి బయటపడ్డాడు. తాను బతుకుతానని ఊహించలేదని జఖారియా కన్నీరుమున్నీరయ్యాడు. ఇలా ఏడు నెలల బాలుడు, ఏడేళ్ల బాలిక, పన్నెండేళ్ల బాలిక, ఇరవై ఏళ్ల యువతి, 44 ఏళ్ల వ్యక్తిని సహాయక బృందాలు కాపాడాయి. మరికొందరిని కాపాడినా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
భూకంపం వచ్చిన 5 రోజుల తర్వాత ఓ మహిళను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. 40 ఏళ్ల జెనెప్ ఖరామన్ శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఆమెను కాపాడారు. కానీ దురదృష్టవశాత్తు ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. కనీసం కుటుంబ సభ్యలు చివరిచూపుకు నోచుకున్నారు. కుటుంబ సభ్యులు ఆలింగనం చేసుకుని తనివితీరా ఏడ్చే అదృష్టాన్ని దక్కించుకున్నారు.
విధిరాతను ఎవరూ తప్పించలేరు. విధిరాత మనకు అనుకూలంగా ఉంటే మరణాన్ని సైతం జయించవచ్చు. టర్కీ, సిరియా భూకంపంలో బయటపడ్డ ప్రాణాలు విధిరాతను జయించినవే అని చెప్పవచ్చు. గంటల కొద్దీ నీరు, ఆహారం లేకుండా పసిప్రాణాలు బయటపడ్డాయంటే అదొక అద్భుతమని చెప్పవచ్చు. ఇవన్నీ కళ్లారా చూసిన సహాయక సిబ్బంది ఆశ్చర్యం తమ వంతయిందని చెబుతున్నారు. శిథిలాల తొలగింపు వేగవంతమైతే మరిన్ని ప్రాణాలు దక్కే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రకృతి ప్రకోపాన్ని సైతం తట్టుకున్న ప్రాణాలకు హ్యాట్సాఫ్ చెప్పవచ్చు.