
కరోనా వైరస్ సందర్భంగా చైనాకు వంత పాట పాడుతూ, ఒక విధంగా ముందే హెచ్చరికలు చేసిన తైవాన్ వంటి దేశాలను ఎగతాళి చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ మనుగడ ఇప్పుడు ప్రమాదంలో పడినట్లు అనిపిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ఈ సంస్థపై కొద్దీ వారాలుగా మండిపడుతున్నారు. ప్రపంచాన్ని తప్పుదారి పట్టించినట్లు ధ్వజమెత్తుతున్నారు.
తాజాగా ఈ సంస్థకు తమ దేశం నుంచి అందాల్సిన నిధుల్లో కోత విధించనున్నట్టు ప్రకటించారు. ఐక్యరాజ్య సమితితో సహా పలు బహుళ దేశాల సంస్థల నిర్వహణ వ్యయంలో అమెరికా అతి పెద్ద భాగస్వామిగా ఉంటూ వస్తున్నది. ఇప్పుడు అమెరికా నిధులలో కొత్త విధిస్తే మిగిలిన సంపన్న దేశాలు సహితం అనుసరించే అవకాశం ఉంది. అప్పుడు వాటి మనుగడ ప్రశ్నార్ధకరంగా మారే అవకాశం లేకపోలేదు.
కరోనా మహమ్మారి చైనాలో మొదట తీవ్రంగా వ్యాపించినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా అనుకూల వైఖరి అవలంబించిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. వైరస్ వెలుగు లోకి వచ్చిన తొలినాళ్లలో ఆ ప్రమాదంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ వద్ద సమాచారం ఉన్నప్పటికీ చైనా అనుకూల వైఖరితో పంచుకోడానికి ఇష్టపడలేదని ట్రంప్ మండిపడుతున్నారు.
చైనాలో కరోనా తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో అమెరికా ఆ దేశ ప్రయాణాలపై నిషేధం విధిస్తే ప్రపంచ ఆరోగ్యసంస్థ వ్యతిరేకించిందని ట్రంప్ గుర్తు చేశారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అతిపెద్ద తప్పుడు నిర్ణయంగా ఆయన స్పష్టం చేశారు. తమ దేశ సరిహద్దులు చైనా వైపు తెరిచి ఉంచాలన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సును అదృష్టవశాత్తు తాను వ్యతిరేకించానని ఆయన పేర్కొన్నారు.
కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సెనేట్ విదేశాంగ సంబంధాల కమిటీ ఛైర్మన్ జిమ్‌రిష్ స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారు. అంతకు ముందు టెడ్రోస్ అధనోమ్ ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ పదవికి రాజీనామా చేసే వరకు నిధుల్ని నిలిపి వేయాలని కోరుతూ అమెరికాలో ఉభయ పక్షాలకు చెందిన 24 మంది సభ్యులతో కూడిన చట్టసభల ప్రతినిధుల బృందం తీర్మానించింది.
మరోవైపు కరోనా ను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన 2.2 ట్రిలియన్ డాలర్ల నిధిని పర్యవేక్షిస్తున్న ఇన్‌స్పెక్టర్ జనరల్ ను ట్రంప్ నిధుల నుంచి తప్పించారు. వాస్తవానికి గత డిసెంబర్ లోని చైనాలో జరుగుతున్న దానిని తైవాన్ బైట పెడితే ఆరోగ్య సంస్థ తీవ్రంగా ఖండించింది.
ఇలా ఉండగా, ట్రంప్ చేసిన ఆరోపణలు నిజం కాదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. కరోనా కల్లోలం ఇంకా ప్రారంభదశలోనే ఉన్న కారణంగా డబ్ల్యూహెచ్ఓకు అందే నిధులకు కత్తెరేయ్యాలనే ఆలోచన కూడా సరికాదని అభ్రిప్రాయపడింది.
2019లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా 400 మిలియన్ డాలర్లకు పైగా నిధులు సమకూర్చింది. చైనా సమకూర్చిన మొత్తం కంటే ఇది రెండు రెట్లకుపైగానే కావడం గమనార్హం. మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాతో కలిసి పనిచేయడమనేది కరోనా వైరస్‌పై అవగాహన పెంచేందుకు ఎంతో అవసరమని సంస్థ డైరెక్టర్ జనరల్ బ్రూస్ ఎలివార్డ్ స్పష్టం చేశారు.