అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలకు సమయం దగ్గరపడింది. అత్యంత ఖర్చు.. ఉత్కంఠభరిత పోరుకు మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 3న జరిగే ఓటింగ్ డే కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పోలింగ్ డే నాడు క్యూలైన్లకు భయపడి ఈ సారి రికార్డు స్థాయిలో దాదాపు 50 శాతం మంది ముందస్తుగానే ఓట్లే వేసి ఉండటం గమనార్హం. అయితే.. పోలింగ్‌కు మరో రెండు రోజుల సమయం ఉండడంతో పలు సర్వేలు కీలకమైన సర్వేను విడుదల చేశాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ల భవితవ్యాన్ని అంచనా వేశాయి.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు
అమెరికా ఎన్నికలకు సంబంధించి ‘కోఆపరేటివ్ ఎలక్షన్ స్టడీ’ని ప్రముఖంగా ప్రస్తావిస్తారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన రాజనీతిశాస్త్ర పరిశోధకులు 2006 నుంచి ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. 2020 కో ఆపరేటివ్ ఎలక్షన్ స్టడీ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ చివరి దాకా వివిధ వర్గాలకు చెందిన మొత్తం 71 వేల మందిని ఆన్ లైన్‌లో సర్వే చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో 18 నుంచి 44 ఏళ్లలోపు యువకులంతా డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్‌కు మద్దతు పలుకుతుండగా, 65 ఏళ్లు పైబడిన వారిలో 53 శాతం మంది ట్రంప్‌ను సమర్థిస్తున్నారు. అదే సమయంలో నిరుద్యోగుల్లోనూ బైడెన్‌కు భారీగా మద్దతు ఉన్నట్లు సర్వే తేలింది. 2016లో హిల్లరీ క్లింటన్‌కు ఓటేసిన వారిలో 95 శాతం మంది ఇప్పుడు బైడెన్‌కు మద్దతుగా ఉన్నారని, 2016లో ట్రంప్ కు ఓటేసిన వాళ్లలో 90 శాతం మంది తిరిగి సపోర్ట్ చేస్తున్నారని సర్వేలో తేలింది.
Also Read: చరిత్ర: దీపావళి.. టపాసులు.. ఎప్పుడు, ఎక్కడ పుట్టాయి?
ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఆసియన్ అమెరికన్లు కూడా జోబైడెన్‌కే మద్దతుగా నిలుస్తున్నారు. ఈ వర్గానికి చెందిన 65 శాతం ఓటర్లు డెమొక్రాట్ అభ్యర్థిని సమర్థిస్తుండగా, కేవలం 28 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు మద్దతుగా ఉన్నారని కోఆపరేటివ్ ఎలక్షన్ స్టడీలో వెల్లడైంది. అదేసమయంలో ట్రంప్ పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తున్న నల్లజాతీయులు 86 శాతం మంది బైడెన్ వైపు మళ్లారు. హిస్పానిక్ అమెరికన్లలో 59 శాతం మంది బైడెన్‌కు మద్దతు పలుకుతున్నారు. ఈ వర్గం నుంచి ట్రంప్ సమర్థకుల శాతం 35 మాత్రమే.
శ్వేతజాతీయుల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఈ వర్గానికి చెందిన 49 శాతం మంది రిపబ్లికన్లకు, 45 శాతం మంది డెమొక్రాట్లవైపు మొగ్గుచూపుతున్నారు. కాలేజీ డిగ్రీ లేని శ్వేతజాతీయుల్లో 57 శాతం మంది ట్రంప్ వైపు, 38 శాతం మంది బైడెన్ వైపు నిలబడ్డారు. అదే డిగ్రీ ఉన్నవాళ్లలో 58 శాతం బైడెన్‌కు, 36 శాతం మంది ట్రంప్‌కు మద్దతిస్తున్నారు. దీనికితోడు అమెరికాలోని మహిళా లోకం ఓటర్ల మద్దతు చూస్తే .. 39 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు మద్దతు ఇస్తుండగా.. 55 శాతం మంది బైడెన్‌కు సపోర్టుగా నిలుస్తున్నారు. ఇక పురుష ఓటర్లలో మాత్రం ఇద్దరికీ సమాన మద్దతు లభించింది.
Also Read: నవ్వులపాలైన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్
అంతేకాదు.. ట్రంప్ జేబు సంస్థగా పేరొందిన ‘ది ఫాక్స్ న్యూస్’ సర్వేలోనూ ట్రంప్‌కు షాక్ తగిలింది. 52 శాతం మంది ఓటర్లు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు.. 44 శాతం మంది నవంబర్ 3న ట్రంప్‌కు ఓటేయనున్నట్లు చెప్పారు. సీఎన్ఎన్ సర్వే ఫలితాల్లో కూడా ట్రంప్ వెనడబడ్డట్టే వెల్లడైంది. రిజిస్టర్ చేసుకున్న ఓటర్లలో 54 శాతం మంది జో బైడెన్‌కు మద్దతు తెలుపగా.. 42శాతం మంది ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటేయనున్నట్లు చెప్పారు. మొత్తంగా ఏ సర్వే చూసినా ట్రంప్‌కైతే వ్యతిరేక పవనాలే వీస్తున్నట్లే వెల్లడైంది.