Badvel bypoll: బద్వేల్ ఉప ఎన్నికలో త్రిముఖ పోరు ఉండబోతోంది. వైసీసీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. విజయం సాధించాలని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయాయి. దీంతో ఎవరికి వారే వాగ్దానాలు చేస్తున్నారు. తమను గెలిపిస్తే పనులు చేసి పెడతామని భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ తన పంతం నెగ్గించుకుని భారీ మెజార్టీ సాధించాలని తాపత్రయపడుతోంది. మరో వైపు బీజేపీ, కాంగ్రెస్ కూడా తమ పరువు నిలుపుకోవాలని చూస్తున్నాయి.

బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్ ను ఎంపిక చేసింది. ఈమేరకు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఏబీవీపీ, యువమోర్చాలో పనిచేసిన సురేష్ ను అధిష్టానం ఎంపిక చేసింది. గెలుపు బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డికి అప్పగించారు. గతంలో వీరిద్దరు టీడీపీలో ఉన్న వారే కావడంతో ఆ పార్టీ ఓటు బ్యాంకు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో గెలుపును శాసించగలమనే ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది.
బద్వేల్ లో ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణించడంతో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో ఆయన భార్య సుధను పోటీలో దింపింది వైసీపీ. టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. జనసేన పోటీలో ఉండటం లేదని ప్రకటించింది. దీంతో అందరు ఇక్కడ ఎన్నిక ఏకగ్రీవమవుతుందని భావించినా బీజేపీలో పోటీలో ఉంటున్నట్లు చెప్పడంతో కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మకు టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ అనివార్యమైంది.
ఈ క్రమంలో వైసీపీ గెలుపు బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించింది. పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా బీజేపీతో చర్చించకుండా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో బీజేపీ ఖంగుతింది. పవన్ టీడీపీతో జత కడతారనే విషయాన్ని బీజేపీ నేతలు అధిష్టానానికి సూచించింది. దీంతో పవన్ కల్యాణ్ ప్రచారానికి బీజేపీ తరఫున రారనే విషయం తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో ముగ్గురి మధ్య పోటీ నెలకొన్నా విజయం మాత్రం ఏకపక్షమే అనే చర్చ జోరుగా సాగుతోంది.