Left parties : ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. మూడు పార్టీలు కూటమి కట్టి గ్రాండ్ విక్టరీ సాధించాయి.కానీ విపక్షాలు చూస్తుంటే వాటిలో ఐక్యత లేదు. జగన్ ను కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇష్టపడడం లేదు. వామపక్షాలు సైతం ముఖం చాటేస్తున్నాయి.దీనికి జగన్ వైఖరి కారణం. 2014 నుంచి 2019 వరకు జగన్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించారు. కానీ ఎన్నడూ విపక్షాలను కలుపు కెళ్లే ప్రయత్నం చేయలేదు. ఐక్య పోరాటాల కంటే ఒంటరి పోరుకు జగన్ ప్రాధాన్యమిస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా విపక్షాలను గౌరవించలేదు. కనీసం వామపక్షాల నేతలను కలిసేందుకు కూడా ఇష్టపడలేదు. ప్రజా సంఘాలు చేపట్టే పోరాటాలను ఉక్కుపాదంతో అణచివేశారు. అందుకే జగన్ అంటే ఒక రకమైన కోపంతో వామపక్షాలు ఉంటాయి. ప్రస్తుతం టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.చంద్రబాబు సీఎం అయ్యారు.విధానపరమైన అంశాల విషయంలో విమర్శలు చేస్తూనే.. మంచి పనులను ఆహ్వానిస్తున్నారు వామపక్షాల నేతలు. పింఛన్ల పెంపు వంటి విషయంలో చంద్రబాబును స్వయంగా కలిసి అభినందించారు.కానీ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చెబుతూ ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు మాత్రం మద్దతు ఇవ్వలేదు.కనీసం సానుకూల ప్రకటన కూడా చేయలేదు. సాధారణంగా వామపక్షాలు ఎప్పుడు ప్రతిపక్షమే. కానీ ఏపీలో మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి.
* దగ్గరకు చేరనివ్వని జగన్
వైసిపి హయాంలో సీఎం జగన్ ను కలిసేందుకు వామపక్షాల నేతలు చాలా రకాలుగా ప్రయత్నించారు. కానీ వారిని కలిసేందుకు జగన్ ఇష్టపడలేదు. కనీసం వారి వాయిస్ ను వినేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు జగన్. తెలంగాణలో కెసిఆర్ మాదిరిగానే జగన్ వ్యవహరించారు.తనకు సంక్షేమ పథకాలతో ప్రజల్లో ఎనలేని ఇమేజ్ ఉందని.. వామపక్షాల పోరాటాలు తనను ఏమీ చేయలేవు అన్నది జగన్ ధీమా. ఆ కారణం గానే వామపక్షాలను పక్కన పెట్టారు జగన్.అందుకే ఇప్పుడు అదే జగన్ కు మైనస్ గా మారింది.
* ఇప్పుడు కలిసి వచ్చేది ఎవరు
ప్రతిపక్షంలోకి వచ్చారు జగన్. ప్రజా పోరాటాలు చేయక తప్పని పరిస్థితి. 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైనా సంఖ్యాపరంగా వైసీపీకి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండేవారు. పార్టీ క్యాడర్ సైతం బలంగా పనిచేసేది. దీంతో ఒంటరి పోరాటానికి జగన్ మొగ్గు చూపారు. కలిసి వస్తామని వామపక్షాలు ప్రతిపాదన పెట్టినా.. కలుపు కెళ్ళే ప్రయత్నాలు చేయలేదు. కనీసం వామపక్షాలు ఒక రాజకీయ పార్టీలు అన్న విషయాన్ని మరిచి జగన్ వ్యవహరించారు.
* భిన్నమైన వాతావరణం
2029 ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీతో జగన్ కలిసి వెళ్ళక తప్పదు. కానీ కలిసి వచ్చే పార్టీ ఏది?కాంగ్రెస్ పార్టీ వస్తుందా?వామపక్షాలు కలుస్తాయా? అంటే సమాధానం దొరకని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందే వైసిపి. వైసీపీ ఆవిర్భావం తర్వాత వామపక్షాలకు విలువ ఇచ్చింది లేదు. ఇప్పుడు వామపక్షాల పోరాటంతో వైసీపీని బలోపేతం చేయడానికి జగన్ ప్రయత్నిస్తారు. ఇన్ని రోజులు తమను పట్టించుకోని జగన్.. ఇప్పుడు దగ్గరకు పిలిచినా వెళ్లేందుకు వామపక్షాలు ఇష్టపడవు.వామపక్షాలు ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి విన్నపాలు చేశాయి. ఆ సందర్భంగా గత ప్రభుత్వం లా కాకుండా..వామపక్షాల సలహాలు సూచనలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మొత్తానికైతే వామపక్షాల వ్యవహార శైలి చూస్తుంటే..మిగతా రాష్ట్రాలకు భిన్నంగా కనిపిస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: If you look at the style of the left parties in ap it looks different from other states
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com