AP Government : జగన్ సర్కారుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. చంద్రబాబుపై పట్టు బిగించేందుకు చాన్స్

గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని  షా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం నిల‌దీసింది.

Written By: Dharma, Updated On : May 3, 2023 5:15 pm
Follow us on

AP Government : జగన్ సర్కారుకు స్వల్ప ఊరట. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తునకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. దీనిపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టేను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో దర్యాప్తునకు మార్గం సుగమమైంది. తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతితో సహా భారీ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని అప్పటి విపక్షంగా ఉన్న వైసీపీ గట్టిగా ప్రశ్నించింది. అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై రంధ్రాన్వేషణ చేసింది. విచారణకు ప్రత్యేక సిట్ ను ఏర్పాటుచేసింది. దానిపై విచారణ జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, అలపాటి రాజా తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పట్లో సిట్ విచారణ వద్దంటూ హైకోర్టు స్టే విధించింది. దీంతో విచారణ నిలిచిపోయింది.

కీలక తీర్పు..
అయితే దీనిపై జగన్ సర్కారు పట్టువదలని విక్రమార్కుడిలా వ్యవహరించింది. సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం బుధ‌వారం కీల‌క‌ తీర్పు వెల్లడించింది. ప్ర‌జాధ‌నం దుర్వినియోగం, అవినీతి, ఇత‌ర‌త్రా అంశాల‌పై ద‌ర్యాప్తు చేస్తే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని  షా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం నిల‌దీసింది. దీంతో   హైకోర్టు తీర్పును పక్కన పెడుతున్నట్లు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం పేర్కొంది.  సిట్ దర్యాప్తునకు మార్గం సుగమం చేసింది. దీంతో చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రాజెక్టుల్లో అవినీతిని బయటకు తీసే పనిలో జగన్ సర్కారు మరింత ముందడుగు వేయనుంది.

వైసీపీ సంబరాలు..
తాజాగా సుప్రీం కోర్టు తీర్పుపై అధికార వైసీపీ సంబరాలు చేసుకుంటుంది. ఎన్నికల ముంగిట చంద్రబాబు అండ్ కోపై పట్టుబిగించేందుకు ఇదో చాన్స్ గా భావిస్తోంది. అయితే గత నాలుగేళ్లుగా పలు విధాలుగా చంద్రబాబు అండ్ కోను ఎలాగైనా ప్రజల్లో పలుచన చేయాలని జగన్ భావిస్తున్నారు. కానీ ఎక్కడ ఆధారాలు సేకరించలేకపోయారు. అన్నిరకాల రికార్డులు తిరగవేసినా ఎక్కడ ఒక్క తప్పును కూడా పట్టుకోలేకపోయారు. చంద్రబాబు ముందుచూపుతో ఏ ఆధారం లేకుండా జాగ్రత్తపడ్డారని ప్రభుత్వ అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇటువంటి సమయంలో సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిట్ దర్యాప్తు ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాలి మరీ. గతంలో మాదిరిగా కేసులు తేలిపోతాయో.. లేకుండా పక్కా ఆధారాలతో చంద్రబాబు అండ్ కోను దోషిగా నిలబడగలరో లేదో అన్న చర్చ అయితే మాత్రం ప్రారంభమైంది. చూడాలి మరీ ఏం జరుగుతుందో.