
దేశాన్ని కుదిపేస్తున్న ‘పెగాసస్’ స్పైవేర్ అంశంపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలు నిజమైనవే అయితే మాత్రం.. ఈ వ్యవహారం చాలా తీవ్రమైనది అని వ్యాఖ్యానించింది అత్యున్నత న్యాయస్థానం. దేశంలోని విపక్ష నేతలు, జర్నలిస్టులు, చివరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులపైనా పెగాసస్ సాఫ్ట్ వేర్ తో నిఘా పెట్టారని, వారు మాట్లాడే ఫోన్లను ట్యాప్ చేసి, వారి మాటలన్నీ వింటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీనిపై విపక్షాలు కేంద్రాన్ని నిందించాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే ఇదంతా చేసిందని ఆరోపించాయి. అయితే.. కేంద్రం మాత్రం తమకు సంబంధం లేదని చెప్పింది. అయినా.. పట్టువీడన విపక్షాలు పార్లమెంట్ లో ఈ అంశంపై విచారణకు పట్టుబట్టాయి. విచారణ కమిషన్ వేయాలని డిమాండ్ చేశాయి. అయితే.. వీటిలో దేనికి కూడా కేంద్రం అంగీకరించలేదు. ఇప్పటికీ.. ఈ విషయమై పార్లమెంట్ అట్టుడుకుతోంది.
కాగా.. ఈ విషయమై పలువురు జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను సుప్రీం ఇవాళ విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ఇది నిజమైతే మాత్రం చాలా తీవ్రమైంది అని వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు తమ పిటిషన్ కాపీలను ప్రభుత్వానికి అందించాలని సూచించింది. అనంతరం విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఆ వాయిదాలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు విచారణకు రావాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే.. మొత్తం 300 మందికిపైగా భారతీయులపై పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా నిఘా పెట్టినట్టు వెలుగులోకి వచ్చింది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు జర్నలిస్టులు, కేంద్ర మంత్రులు, సుప్రీం కోర్టు రిజిస్ట్రార్లు కూడా ఉన్నట్టు తెలిసింది. దీంతో.. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అయినా.. కానీ కేంద్రం ఇప్పటి వరకు విచారణ కమిషన్ వేయలేదు. తాజాగా.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం మరింత సంచలనం రేకెత్తిస్తోంది. మరి, తరువాయి విచారణలో ఏం జరుగుతుందన్నది చూడాలి.