
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన 2014లో జరిగింది. కానీ.. హైదరాబాద్ మాత్రం పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఈ మేరకు విభజన చట్టంలోనే పొందుపరిచారు. అయితే.. విభజన జరిగిన రెండేళ్లలోనే హైదరాబాద్ యునైటెడ్ క్యాపిటల్ అన్న విషయం గురించి అందరూ మరిచిపోయారు. కానీ.. కరోనా నేపథ్యంలో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.
ఇతర రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితులు వందలు, వేలల్లో హైదరాబాద్ కు వరుస కట్టడంతో.. తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన అంబులెన్సులు రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంది. దీనిపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఏపీ నుంచి నిరసన వ్యక్తమైంది. దీంతో.. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి మాత్రమే ఈ-పాస్ ద్వారా అనుమతించింది.
దీనిపై ఏపీకి చెందిన ఓ విద్యార్థి సుప్రీంను ఆశ్రయించారు. రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కు వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ-పాస్ నిబంధన ఎలా విధిస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. ఈ విషయమై విచారించిన న్యాయస్థానం.. స్పష్టత ఇచ్చింది.
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం.. ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగించొద్దనే నిబంధనపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం. ఈ నిబంధన తెలంగాణ ప్రభుత్వం విధించిన ఈ-పాస్ ను అడ్డుకోలేదని స్పష్టం చేసింది. అదేవిధంగా.. విపత్తు నిర్వహణ చట్టం కింద జారీచేసిన ఈ-పాస్ కు.. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 వర్తించదని తేల్చి చెప్పింది. తద్వారా.. అత్యవసర సమయాల్లో ఈ-పాస్ వంటివి జారీచేయడం తప్పుకాదని, తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం సరైనదేనని సుప్రీం స్పష్టం చేసింది.