
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ పార్టీ ఇక కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టబోతుందా..? 21 ప్రతిపక్ష పార్టీలకు సారథ్యం వహించనుందా..? కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీతో ఇక తాడోపేడో తేల్చుకోనుందా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాజ్యసభలో వైసీపీ అనుసరిస్తున్న తీరు.. ఈ రకమైన ప్రశ్నలకు కేంద్రబిందువులగా మారాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ వ్యవహారమే బీజేపీతో వైసీపీ వైరానికి కారణమనే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు దేశ రాజకీయాల్లో తటస్థంగా ఉంటూ వచ్చిన వైసీపీ అకస్మాత్తుగా తన వైఖరిని మార్చుకుంటోంది. కేంద్రాన్ని ఢీకొట్టేలా తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం పట్టువిడవకపోవడం.. ప్రయివేటీకరణ నుంచి వెనక్కి తగ్గకపోవడం వంటి పరిణామాలు వైసీపీని పునరాలోచనలో పడేశాయి. ఈ విషయంలో కేంద్రాన్ని ఎంత సమర్థించినా.. రాష్ట్రంలో రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదనే భావనలో వైసీపీ ఈ నిర్ణయాలు తీసుకుంటోంది.
దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన మూడు వ్యవసాయబిల్లుల విషయంలోనూ వైసీపీ కేంద్రాన్ని సమర్థించింది. ఈ బిల్లులకు అనుకూలంగా వైసీపీ సభ్యులు రాజ్యసభలో ఓటు వేశారు. తోటి తెలుగు రాష్ట్రం దీన్ని వ్యతిరేకించినప్పటికీ.. పట్టించుకోలేదు. వ్యవసాయబిల్లులకు అనుకూలంగా వ్యవహరించింది. అదే సమయంలో వైసీపీ ఎన్డీఏలో చేరడం ఖాయమని వార్తలు సైతం వచ్చాయి. తాజాగా వైసీపీ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆఫ్ ప్రభుత్వ అధికారాలను మరింత కుదిస్తూ.. కేంద్రం రాజ్యసభ్యలో ప్రవేశపెట్టిన గవర్నమెంటు ఆఫ్ నేషనల్ కేపిటల్ టెర్రిటరీ ఆప్ ఢిల్లీ బిలలు 2021పై చర్చను వైసీపీ సభ్యులు బహిష్కరించారు.
ఈ వారం రోజుల వ్యవధిలో వైసీపీ కేంద్ర విధానాన్ని తప్పు పడుతూ.. వాకౌట్ చేయడం ఇది రెండోసారి. దేశంలోనే అతిపెద్ద నాలుగోరాజకీయ పార్టీ వైఎస్సార్ సీపీ. బీజేపీ , కాంగ్రెస్ వాటి మిత్ర పక్షాలు తృణముల్ తరువాత ఆ స్థాయిలో లోక్ సభలో సభ్యుల బలం ఉన్న ఏకైక పార్టీ వైసీపీ.ఈ స్థాయిలో ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇన్నాళ్లు మెతక వైఖరిని అనుసరించింది. ఎప్పుడైతే వైజాగ్ స్టీల్ ప్లాంటును కేంద్రం అమ్మకానికి పెట్టిందో.. అప్పటి నుంచే వైసీపీ తన విధానాన్ని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.