Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లాలో వైసీపీలో విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి.మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తన గన్ మాన్లను ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వానికి సరెండర్ చేశారు.దీనికి వైవి సుబ్బారెడ్డి తీరే కారణమని ప్రచారం జరుగుతోంది. ఓ కేసు విషయంలో పోలీసులు అసలు నిందితులను విడిచిపెట్టడంతో నిరసనగా తనకు ప్రభుత్వం కల్పించిన గన్ మాన్ లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దీంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఏకంగా వీధి పోరాటానికి దిగడం విశేషం.
గత కొంతకాలంగా ప్రకాశం జిల్లాలో వై వి సుబ్బారెడ్డి,బాలినేని శ్రీనివాస్ రెడ్డిల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. సాక్షాత్ జగన్ సమక్షంలోనే పంచాయతీలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. బాలినేని కంటే వైవి సుబ్బారెడ్డి జగన్కు దగ్గర బంధువు. తనకు మంత్రి పదవి పోవడంలో సుబ్బారెడ్డి పాత్ర ఉందని బాలినేని అనుమానిస్తూ వచ్చారు. అందుకే మూడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి సైతం రాజీనామా చేశారు. దాదాపు పార్టీని వీడుతారని ఒక టాక్ నడిచింది. కానీ బాలినేని మెత్తబడ్డారు. ఆయన స్థానంలో నియమితులైన విజయ్ సాయి రెడ్డి చొరవతో ఇటీవల పార్టీలో యాక్టివ్ గా మారారు. కానీ వైవి సుబ్బారెడ్డి తో ఉన్న విభేదాలు మాత్రం సమసిపోలేదు .
ఇటీవల ప్రకాశం జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల స్కాం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎంపీ వైవి సుబ్బారెడ్డి అనుచరులు కొందరు ఆయన మద్దతు తో నకిలీ పట్టాలు తయారుచేసి భూ వివాదాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఈ ముఠా చాలా పెద్ద స్థాయిలో అక్రమాలకు పాల్పడింది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు పోలీసులను కోరారు. కేసులో ఎంతటి వారినైనా అరెస్టు చేయాల్సిందేనని పట్టు పట్టారు. కానీ నెలలు గడుస్తున్నా ఇంతవరకు అసలు దోషులను పట్టుకోవడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చారు.ఇటీవల ఈ కేసులో పోలీసులు పదిమందిని అరెస్ట్ చేశారు. కానీ అసలు సూత్రధారిని విడిచిపెట్టి.. పూర్ణచంద్రరావు అనే వ్యక్తిని ప్రధాన నిందితునిగా చూపి.. కేసును క్లోజ్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బాలినేని పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సెక్యూరిటీని సరెండర్ చేశారు.
ఈ నేపథ్యంలో బాలినేని పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యానాలు చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా ఇటువంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నానని చెప్పుకొచ్చారు. దీంతో వై వి సుబ్బారెడ్డి విషయంలో అమీ తుమీ తేల్చుకోవడానికి బాలినేని సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న వైవి సుబ్బారెడ్డిని జగన్ వెనుకేసుకొస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అన్నింట వైవి సుబ్బారెడ్డి పై చేయి సాధిస్తుండడంతో ఇక ఏదో ఒకటి తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. మరోవైపు సెక్యూరిటీని సరెండర్ చేసిన బాలినేనిని గతం మాదిరిగా బుజ్జగిస్తారా? లేకుంటే విడిచి పెడతారా? అన్నది చూడాలి.