AP Employees Strike: అటు ఏపీ ప్రభుత్వం చేతులో చిల్లీ గవ్వ లేక ప్రభుత్వ ఉద్యోగుల కోరికలు తీర్చడం లేదు. ఇటు ఉద్యోగులు తమ కోరికలు తీరనిదే తగ్గేదేలే అన్నట్టుగా సమ్మెకు రెడీ అయ్యారు. ఇద్దరికీ ఎవరి కారణాలు వారికి ఉన్నా కూడా వీరిద్దరి మధ్యలో నలిగిపోయేది ప్రజలు. అందుకే ఏపీ హైకోర్టు చొరవ తీసుకుంది. పెద్ద మనసు చాటుకుంది. ప్రభుత్వాన్ని, ఉద్యోగుల మధ్య సంధికి ముందడుగు వేసింది.
సమ్మె చేస్తే ఉద్యోగులకు పోయేదేం లేదు. ఇక ప్రభుత్వం వద్ద టికానా లేకపోవడంతో వారి కోరికలు తీర్చలేక మౌనంగా ఉంటోంది. మధ్యలో బలి అయ్యే వారు ఎవరు? ‘ప్రజలు’. అందుకే ఇరువురి పంతాలు, పట్టింపులకు ప్రజలు నష్టపోవద్దని హైకోర్టు అతిపెద్ద చొరవ తీసుకుంది. సమ్మె చేస్తున్న ఉద్యోగ సంఘాలకు చెందిన 12 మంది నాయకులు కోర్టు ముందు మధ్యాహ్నం 2.15 గంటలకు హాజరు కావాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించడం కీలక పరిణామంగా చెప్పొచ్చు.
ప్రభుత్వ , ఉద్యోగుల పంతానికి సమస్య జఠిలమై సమ్మె దిశగా పోవద్దనే హైకోర్టు కలుగజేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాల నాయకులను పిలిచి హైకోర్టు మాట్లాడుతోంది. సయోధ్య కుదిర్చేందుకు దిశానిర్ధేశం చేయనుంది.
ప్రభుత్వం, ప్రజలకు మధ్య ఉద్యోగులే సంధాన కర్తలు. అలాంటి కీలకమైన ఉద్యోగులు సమ్మె చేస్తే ఏపీ వ్యవస్థను కుప్పకూలుతుంది. ప్రజలు నానా అవస్థలు పడుతారు. దీని వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి.పైగా కరోనా కల్లోలం వేళ ఈ పరిణామం ఏపీ ఆర్థిక వ్యవస్థను మరింత చిన్నాభిన్నం చేస్తుంది. అందుకే హైకోర్టు తీసుకున్న ఈ చొరవను నిజంగానే అభినందించకతప్పదు.