Omicron Effect: ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసుల నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై ఇప్పటికే తెలంగాణ సర్కారు పలు ఆంక్షలు విధించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కఠిన ఆంక్షలు విధించింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా జనం గుమిగూడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ఈ ఆంక్షలు విధించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడలో కఠిన ఆంక్షలు విధించారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో అర్ధరాత్రి వరకు వేడుకలకు అనుమతి లేదు. ఫైవ్ మెంబర్స్ కన్న ఎక్కువ మంది ఒక చోట ఉండరాదు.
Also Read: ఆడపిల్లలకు ఉపద్రవం.. ఏంటీ కొత్త మార్పులు
నగరాల్లోని క్లబ్‌లు, రెస్టారెంట్లలో 60 శాతం ఆక్యుపెన్సీతోనే వేడుకలు నిర్వహించుకోవాలి. ఈ వేడుకలకుగాను క్లబ్స్, రెస్టారెంట్స్ నిర్వాహకులు కంపల్సరీగా పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి. డీజేలు, హెవీ స్పీకర్స్‌కు పర్మిషన్ లేదు. రోడ్లపైన కేక్ కటింగ్స్ కూడా చేయరాదు. 144 సెక్షన్ స్ట్రిక్ట్‌గా అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. టపాసులు పెల్చడం వలన పిల్లలకు, వృద్ధులకూ ఇబ్బందులు కలగొచ్చు. కాబట్టి వాటికి దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఇకపోతే మద్యం తాగి డ్రైవింగ్ చేసేందుకు అనుమతి లేదు. నగరవ్యాప్తంగా 15 చోట్ల డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే మందుబాబులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. విజయవాడలోని మెయిన్ హైవేస్ అయిన బందర్ రోడ్, బీఆర్టీఎస్ రోడ్, ఏలూరు రోడ్లలో కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయి. బెంజ్ సర్కిల్ , కనకదుర్ఘ , పీసీఆర్ ఫ్లై ఓవర్లపై ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఈ నిబంధనల ఉల్లం‘ఘనులు’ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రతీ ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా పోలీసులు కోరారు. న్యూ ఇయర్ వేడుకలకు పిల్లలను బయటకు పంపకుండా ఇంటి లోపలనే వేడుకలు జరుపుకోవాలని పోలీసులు సూచించారు.
Also Read: భారత్ లో థర్డ్ వేవ్ మొదలైందా? మళ్లీ లాక్ డౌన్ తప్పదా?