YSRTP – Sharmila : తెలంగాణలో మరో పార్టీ పుట్టిన రెండున్నరేళ్లకే కనుమరుగు కాబోతోంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, సంక్షేమ సారథిగా తెలుగు ప్రజల గుండెల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి తరహా పాలనను తెలంగాణలో తిరిగి తీసుకురావాలన్న లక్ష్యంతో ఆయన కూతురు వైఎస్.షర్మిల 2021, జూలై 8న తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ(వైఎస్సార్‌టీపీ)ని స్థాపించారు. దాదాపు 800 రోజుల పాటు పార్టీని నడిపారు. తర్వాత చేతులెత్తేశారు. పార్టీని తెలంగాణలో నడిపించడం, మనుగడ సాధించడం అంత ఈజీ కాదన్న విషయం ఆమెకు తొందరగానే అర్థమైంది. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే ఎన్నికల వేళ షర్మిలను పార్టీలో చేర్చుకుంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువని భావించిన టీపీసీసీ చేరికను వాయిదా వేసింది. ఎన్నికలు ముగిసి పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు షర్మిలను చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేసింది కాంగ్రెస్ హైకమాండ్. షర్మిలతోపాటు 800 రోజుల వైఎస్సార్ తెలంగాణ పార్టీని కూడా తనలో కలుపుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు షర్మిల కూడా ఇందుకు సుముఖంగా ఉన్నారు.
ముహూర్తం ఖరారు..
వైఎస్సార్ టీపీపీ కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. జనవరి 4న ఢిల్లీలో అధికారికంగా పార్టీ విలీనం ఉంటుందని తెలుస్తోంది. ఈమేరకు షర్మిల మంగళవారం లోటస్‌పాండ్‌లో నిర్వహించిన వైఎస్సార్‌టీపీ ముఖ్యనాయకుల సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీలో చేరేందుకు షర్మిల బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. గురువారం ఖర్గే, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం.
రాజ్యసభ టికెట్, అనుచరులకు నామినేటెడ్ పదవులు..
వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో అన్ కండీషన్‌గా విలీనం చేసినందుకు షర్మిలకు కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు పంపుతారని తెలుస్తోంది. ఈమేరకు కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక, షర్మిల సూచించిన ఇద్దరు ముగ్గురికి తెలంగాణలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి కూడా అంగీకారం కుదిరినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో కీలక బాధ్యతలు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 2024లో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంపై హైకమాండ్ దృష్టిపెట్టింది. రాజశేఖరరెడ్డి కూతురుగా ఏపీలో షర్మిలకు గుర్తింపు ఉంది. పాదయాత్రతో ఆమే అనేక జిల్లాలు తిరిగారు. ఈ నేపథ్యంలో పార్టీలో చేర్చుకుని ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం ఆలోచన చేస్తోంది. అవసరమైతే మరోసారి పాదయాత్ర చేయించాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార వైసీపీని గద్దె దించడంతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా షర్మిలను ఎన్నికల కోసం ఎక్కువగా వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. షర్మిల వెంట కాంగ్రెస్‌లోకి రావడానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నరన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉత్సాహం కనిపిస్తోంది.
ఆదరస్తారా తిరస్కరిస్తారా..
తెలంగాణ కోడల్ని అని, తన జీవితమంతా తెలంగాణలోనే గడుపుతానని గతంలో షర్మిల చెప్పారు. తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యేందుకు 3,500 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేసులపాలయ్యారు. అరెస్ట్ అయ్యారు. కానీ, తెలంగాణ అక్కున చేర్చుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఏపీలో అడుగు పెట్టాలనుకుంటున్నారు. ఇందుకు కాంగ్రెస్‌ను ఎంచుకున్నారు. మరి 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు వైఎస్సార్‌సీపీ నాయకురాలిగా, ఎన్నికల తర్వాత 2021 నుంచి తెలంగాణ వైఎస్సార్‌టీపీ నాయకురాలిగా పనిచేసిన షర్మిలను ఇప్పుడు కాంగ్రెస్ నాయకురాలిగా ప్రజలు ఆదరిస్తారా లేదా అన్నది చూడాలి.