దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గడంతో పాఠశాలలను పట్టాలెక్కించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటిదాకా వృద్ధులు, 18 ఏళ్ల వారిపై ప్రతాపం చూపిన కరోనా వైరస్ థర్డ్ వేవ్ లో పిల్లలను వెంటాడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరిచేందుకు రెడీ కావడం తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమవుతోంది.
ఇప్పటిదాకా 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే దేశంలో టీకాలు వేశారు. 18 ఏళ్లలోపు పిల్లలకు అసలు టీకాల కార్యక్రమమే ప్రారంభం కాలేదు. కరోనా టీకాలు పిల్లలకు రావడానికి సెప్టెంబర్ వరకు పడుతుందని అంటున్నారు. ఆలోపు ఆదరబాదరగా ఏపీ ప్రభుత్వం పాఠశాలలు తెరవడంపై తల్లిదండ్రుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఆగస్టు 15లోపు ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లు అందరికీ టీకాలు వేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అలా వేసేసి పిల్లలకు కరోనా సోకకుండా పాఠశాలలను ప్రారంభిద్దామని అనుకుంటోంది. కానీ ఇప్పటికీ కూడా టీకాలు వేయనిదే తమ పిల్లలను పాఠశాలలకు పంపము అని తల్లిదండ్రులు ఖరాఖండీగా చెబుతున్నారు.
తెలంగాణలోని గ్రామాల్లో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోంది. గ్రామాలకు గ్రామాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఇటీవల కాలంలో మరణాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లోనూ సెకండ్ వేవ్ తగ్గిందనుకుంటున్న సమయంలో మళ్లీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
మొన్నటివరకు అస్సలు గ్రామాల్లో పెద్దగా కరోనా లేకుండేది. కానీ ఇప్పుడు కేసులు, మరణాలు పెరిగి ఏ ఊరుకు ఆ ఊరు లాక్ డౌన్ పెట్టేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని అనేక కాలనీల్లో 15 రోజుల క్రితం వరకు ఒకటీ రెండు తప్ప పెద్దగా కేసులు ఉండేవి కావు.. 10 రోజులుగా వాటి సంఖ్య బాగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
గాంధీ, టిమ్స్ సహా హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రులకు కరోనా రోగుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నగరంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామాల్లో కేసులు పెరగడంతో థర్డ్ వేవ్ ముప్పు తప్పదా? అన్న భయాలు వెంటాడుతున్నాయి. కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేయడమే దీనికి కారణం అని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇప్పటికే కేరళ, తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో అంతగా పెరగకున్నా మున్ముందు పెరగడం ఖాయం. ఇప్పుడు విద్యార్థులను స్కూళ్లకు రానిస్తే వారికి సోకితే ఎవరు బాధ్యులన్న ప్రశ్న తలెత్తుతోంది. అందుకే ఇప్పుడు పిల్లల జీవితాలతో ఆడుకోకుండా ఏపీ ప్రభుత్వం ఆగస్టు 16 నుంచి తలపెట్టిన పాఠశాలల ప్రారంభాన్ని దసరా వరకు వాయిదా వేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు. లేకుంటే జరగబోయే అనర్థాలకు జగన్ సర్కార్ బాధ్యులు అవుతుందని హెచ్చరిస్తున్నారు.