Ayodhya Ram Mandir : భారత దేశం లోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువుల స్వప్నం అయోధ్యలో రామాలయ నిర్మాణం. 500 ఏళ్లుగా రామాలయ నిర్మాణం కోసం జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించడంతో రెండేళ్ల క్రితం ఆలయ నిర్మాణం ప్రారంభించారు. 2022 డిసెంబర్ నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తయింది. దీంతో 2023, జనవరి 22న ఆలయలో బాలరాముడి విగ్రహం ప్రతిష్టాపనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేశంలోని ప్రముఖులతోపాటు విదేశాల నుంచి కూడా ప్రముఖులు తరలివచ్చారు. బాల రాముడిని దర్శించుకుని తరించారు. పూర్తిగా విరాళాలతో ఈ ఆలయం నిర్మించారు. ప్రధాని నరేంద్రమోదీ బాలరాముని ప్రాణప్రతిష్ట నిర్వహించారు. అప్పటి నుంచి నిత్యం వేల మంది భక్తులు అయోధ్య వెళ్లి రామయ్యను దర్శించుకుంటున్నారు.
వార్షికోత్సవంపై సమావేశం..
ఆలయం ప్రారంభించి మరో రెండు నెలల్లో ఏడాడది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో వార్షికోత్సవం నిర్వహణ కోసం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షతన ఇటీవల సమావేశం నిర్వహించారు. రామాలయ వార్షికోత్సవ వేడుకల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. వార్షికోత్సవ వేడుకలను జనవరి 22న కాకుండా జనవరి 11నే నిర్వహించాలని నిర్ణయించారు. పది రోజుల ముందే వేడుకల నిర్వహణ వెనుక కారణం ఉందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సమావేశంలో ఏ రోజు ఏ ఉత్సవం నిర్వహించాలో నిర్ణయం తీసుకున్నారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం..
రామాలయ వార్షికోత్సవాన్ని హిందూ క్యాలెండర్ ప్రకారం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. పుష్య శుక్ల ద్వాదశి అంటే కూర్మ ద్వాదశి రోజు ఉత్సవం జరుపుకోవాలని పండితులు తెలిపారు. అంటే ఇంగ్లిష్ క్యాలెండర్ 2025, జనవరి 11న ఈ తిథి వస్తుంది. దీని ప్రకారమే అయోధ్యలో నూతన రామాలయ, బాలరాముని ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవం నిర్వహించాలని తీర్మానించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించారు.