
MLC Kavitha: ” కంసుడు పసిపిల్లాడు అని చూడకుండా శ్రీకృష్ణుడిని చెరసాలలో ఉంచాడు. ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. చివరకు చంపే ప్రయత్నం కూడా చేశాడు. కానీ ఏం జరిగింది? జైల్లో ఉంచితే శ్రీకృష్ణుని బలం తగ్గిందా?” అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఢిల్లీ మద్యం కేసులో చార్జి షీట్ లో ఆమె పేరు వినిపించడం, ఆమెను విచారణకు రావాలని పిలుపునివ్వడంతో… అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆమె ఢిల్లీ వెళ్లారు. గురువారం ఢిల్లీలోని అక్బర్ రోడ్లో తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
గతంలో ఎప్పుడూ మోదిపై తీవ్ర విమర్శలు చేయని కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కాం తర్వాత సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తుతున్నారు.. ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతోందని దుయ్యబడుతున్నారు.. అంతేకాదు తను నువ్వు ఎలాగైనా జైలుకు పంపిస్తారని తెలుసుకుందేమో గాని… కవిత నోటి నుంచి వైరాగ్యపు మాటలు ధ్వనించాయి.

మహిళా దినోత్సవం రోజు మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆడి పాడిన కవిత, ఆ తర్వాత ఒక్కసారిగా ఒత్తిడి వాతావరణం లో కూరుకుపోయారు. ఇందుకు కారణం కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి లేఖ రావడమే. అప్పటినుంచి ఆమె ఎవరితోనూ మాట్లాడలేదు.. మీడియా ప్రతినిధులు తాకిడి పెరిగిన నేపథ్యంలో ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు ఆ రోజు సాయంత్రమే ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీ వెళ్తూ కేసీఆర్ తో మాట్లాడారు.. ఈ క్రమంలో నీకు నేను ఉన్న ఏం కాదు అని కేసిఆర్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.. మరోవైపు బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన కవిత… తన నివాసంలో రాత్రంతా కొనుక్కుతియకుండా అలాగే ఆలోచిస్తూ గడిపినట్టు తెలుస్తోంది. మరోవైపు గురువారం ఉదయం విలేకరుల సమావేశంలో మోడీ మీద తీవ్ర విమర్శలు చేశారు.. కవిత ప్రెస్ మీట్ సాగుతున్నప్పుడే, కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా కొనసాగడం విశేషం. సాధారణంగా వైరాగ్యపు మాటలు మాట్లాడేందుకు ఇష్టపడని కవిత, ఢిల్లీకి వెళ్లిన తర్వాత చాలా నిరాశతో మాట్లాడినట్టు కనిపించారు. పురాణాల్లో ఘటనలను ఉదాహరణలుగా చూపించారు. అంటే ఆమెను అరెస్టు చేస్తారని కవిత బలంగా నమ్ముతున్నారా?! ఇప్పుడు ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు కానీ.. ఇప్పటికైతే కవిత చుట్టూ ఉచ్చు మాత్రం గట్టిగా బిగుసుకుంటున్నది.
