కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు.. కాపుల సమస్యల పరిష్కారం.. కాపుల హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం కొన్నేళ్లుగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. అందుకే ఆయన మాజీ మంత్రిగా కంటే కూడా కాపు నాయకుడిగానే ఫేమస్ అయ్యారని చెప్పాలి. ఒక బలమైన సామాజిక వర్గం కోసం తన రాజకీయ జీవితాన్ని సైతం ఫణంగా పెట్టారు. ఆయన కాపు రిజర్వేషన్ల పోరును పట్టించుకోకుండా ఒకే పార్టీని వేదికగా చేసుకొని ఉంటే.. ఎప్పుడో డిప్యూటీ సీఎం రేంజ్‌కు ఎదిగేవారనడంలో అతిశయోక్తి లేదు. కానీ.. ఆయన ఓ నిర్ణయం తీసుకొని మూడు దశాబ్దాలుగా దాని మీదనే పోరాడుతున్నారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు బీజేపీ ఇటీవల ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఆయనను పార్టీలోకి ఆహ్వానించింది. ఏకంగా బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిశారు. కానీ.. ముద్రగడ నుంచి ఆశాజనకమైన సమాధానం రాలేదని అంటున్నారు. తాను కాపుల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాయని ఆయన చెప్పారని సమాచారం. కాపులను బీసీలలో చేరిస్తే తన మద్దతు బీజేపీకి ఉంటుందని చెప్పినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఈ బహు కష్టమైన షరతుని ముద్రగడ పద్మనాభం పెట్టడంతో బీజేపీకి ఇబ్బందికరమే అంటున్నారు.
కేంద్రం ముందు ఎన్నో ఇలాంటి డిమాండ్లు ఉన్నాయి. కాపులకు రిజర్వేషన్లు అంటే కొత్త చిచ్చు రాజేసినట్లేనని కూడా చెబుతున్నారు. అయితే ముద్రగడ పద్మనాభంను సోము వీర్రాజు కలవడంలో వేరే ఆంతర్యం ఉందని కూడా అంటున్నారు. ఏపీలో ఉన్న రెండు బలమైన పార్టీలకు ఆల్టర్నేట్‌గా బీజేపీ ఉందని, కాపుల మద్దతు ఆ పార్టీకి కావాలన్నది ఆయన ఆలోచన. ముద్రగడ ఎస్ అన్నా నో అన్నా కూడా ఆయనతో భేటీ వేయడం ద్వారా కాపుల మనసుల్లోకి బీజేపీ చొచ్చుకుపోయేందుకే సోము ఇలా పావులు కదిపారు అంటున్నారు.
ఇక గోదావరి జిల్లాల్లోని కాపులు గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య చీలిపోయారు. రేపటి ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది. అయితే బీజేపీ దూకుడు ప్రారంభిస్తే టీడీపీకి ఓట్లే బీజేపీ–జనసేన కూటమికి ఎక్కువగా మళ్లుతాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు జగన్ ఎటూ కాపుల రిజర్వేషన్ డిమాండ్ కుదరదు అని ఎన్నికల ముందు చెప్పేశారు. ఇలా కాపుల ఓట్ల కోసం టీడీపీ బీజేపీ పోటీ పడితే బీసీలు పోలరైజ్ అవుతారని, అది వైసీపీకే లాభమని అంటున్నారు. మొత్తానికి కాపుల ఓట్ల కోసం జరిగే పోరులో అంతిమంగా నష్టపోయేది టీడీపీ. సైకిల్‌కే రిపేరు చేయాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణుల అభిప్రాయం.