EVM: బిజెపి విజయానికి ఈవీఎంలతో లింక్?

ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవీఎంలను చాలా దేశాలు పక్కన పెట్టాయి. ఇందులో అగ్రదేశాలు సైతం ఉన్నాయి. కేవలం ట్యాంపరింగ్, హ్యాకింగ్ అనుమానాలతోనే ఈవీఎంలను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : April 19, 2024 10:35 am

EVM

Follow us on

EVM: ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈవీఎంలు చర్చకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గెలుపునకు ఈవీఎంల ట్యాంపరింగ్ కారణమని ఆరోపణలు ఉన్నాయి. అయితే బిజెపి గెలిచినప్పుడు మాత్రమే ఈ ఆరోపణ బలంగా వినిపిస్తోంది. విపక్షాలు విజయం సాధించినప్పుడు మాత్రం ఇది వినిపించకపోవడం విశేషం. తాజాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. టెక్నాలజీకి ప్రాధాన్యం ఇచ్చే దేశాల్లో సైతం ఈవీఎంలను పక్కన పెట్టారు. ఇండియాలో మాత్రం ఈవీఎంలను కొనసాగించడం పై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం పెద్ద కష్టం కాదని సైబర్ నిపుణులు స్పష్టం చేయడంతో.. అనుమానాలకు బలం చేకూరుతోంది. కానీ ఎన్నికల కమిషన్ అధికారులు మాత్రం పెద్దగా స్పందించకపోవడం విశేషం.అయితే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈవీఎంలపై ఆరోపణ చేయడం.. మరోసారి చర్చకు దారితీసింది.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవీఎంలను చాలా దేశాలు పక్కన పెట్టాయి. ఇందులో అగ్రదేశాలు సైతం ఉన్నాయి. కేవలం ట్యాంపరింగ్, హ్యాకింగ్ అనుమానాలతోనే ఈవీఎంలను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.ఇండియాలో ఈవీఎంలను అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చేలా రూపొందించారన్నది ఒక ఆరోపణ.అయినా సరే భారత ఎన్నికల సంఘం పెద్దగా పట్టించుకోలేదు. ఇటువంటి ఆరోపణలే రావడంతో ఫ్రాన్స్,జర్మనీ,జపాన్, యూకే, ఐర్లాండ్, కెనడా, సింగపూర్, బంగ్లాదేశ్, ఫిన్లాండ్లలో ఈవీఎంలకు గుడ్ బై చెప్పారు. కానీ మనదేశంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా ఈవీఎంలను మార్చడం లేదు.

మొన్న ఆ మధ్యన ఈవీఎంల పనితీరును బయటపెట్టారని హ్యాకింగ్ ఎక్స్పర్ట్ హరిప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అమెరికాకు చెందిన సైబర్ నిపుణుడు అలెక్స్, నెదర్లాండ్ కు చెందిన రోప్ తో కలిసి ప్రయోగాలు చేశారు. ఓటింగ్ మిషన్ ను ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చు వీడియో తీసి చూపించారు. అయితే ఇలా చూపిన పాపానికి ప్రసాదు ను అరెస్టు చేశారు. కనీసం ఈవీఎంలపై చర్చ లేకుండా చేశారు. మధ్యప్రదేశ్లో అయితే ఓటరు అవగాహన కార్యక్రమంలో ఒక వింత ఘటన బయటపడింది. ఈవీఎంలలో నోటాకు ఓటు వేస్తే.. బిజెపికి ఓటు పడినట్లు స్లిప్పులు వచ్చాయి. దీంతో ఈవీఎంలపై అనుమానాలు మరింత పెరిగాయి.

తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈవీఎంలపై, వాటి పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరిగే ప్రతిసారి మోడీ ఎందుకు అధికారంలోకి వస్తున్నారని.. కారణం ఈవీఎం లేనని ఆరోపించారు. బ్యాలెట్ పేపర్ పై ఎన్నికలు నిర్వహించకుండా ఎందుకు ఈవీఎంలతో నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో సోషల్ మీడియాలో తెలంగాణ సీఎం కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరోసారి ఈవీఎంల పనితీరుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.