Kuppam- Pulivendula: కుప్పం, పులివెందుల నియోజకవర్గాలు రాజకీయ ప్రత్యర్థులకు చిక్కుతాయా? అది ఎంతవరకు సాధ్యం? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదని జగన్ భావిస్తున్నారు. అదే సమయంలో జగన్ను దారుణ దెబ్బ కొట్టాలని చంద్రబాబు వ్యూహం రూపొందిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ తరహా రాజకీయాలు కనిపించలేదు. వైఎస్సార్, చంద్రబాబుల మధ్య హోరాహోరీ ఫైట్ నడిచినా ఒకరి నియోజకవర్గాల్లో ఒకరు వేలు పెట్టలేదు. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహారం నడుస్తోంది.
అయితే తొలుత సీఎం జగనే ఇటువంటి చర్యలకు దిగారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అయితేనే తాను ప్రశాంతంగా ఉండగలనని భావిస్తున్నారు. ఏకంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని జగన్ టార్గెట్ చేయడం విశేషం. వై నాట్ 175 నినాదంతో గట్టిగానే రంకెలు వేస్తున్నారు. కుప్పంలో స్థానిక సంస్థల్లో వైసిపి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఊపుతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును మట్టి కరిపించాలని జగన్ చూస్తున్నారు. ఆ బాధ్యతను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్ప చెప్పారు. కుప్పంలో టిడిపిని బలహీన పరిచేందుకు పెద్దిరెడ్డి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనిని చంద్రబాబు సునాయాసంగా అడ్డుకోగలుగుతున్నారు.
అయితే తనను నిర్వీర్యం చేయాలన్న జగన్ పై చంద్రబాబు ఫోకస్ పెంచారు. వై నాట్ పులివెందుల అంటూ సౌండ్ చేయడం ప్రారంభించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టు దొరకడంతో.. అదేపనిగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పులివెందులలోనే జగన్ దెబ్బతీయాలని రంగంలోకి దిగారు. బుధవారం పులివెందుల జంక్షన్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా.. ఉమ్మడి కడప జిల్లాలో గండికోట,చిత్రావతి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలను చంద్రబాబు పరిశీలించనున్నారు.
గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కుప్పం పై, చంద్రబాబు పులివెందుల నియోజకవర్గం పై అస్సలు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఎన్నికల సమయంలో ఎవరో ఒకరు క్యాండిడేట్ను నిలబెట్టి చేతులు దులుపుకునేవారు. అయితే ఇప్పుడు జగన్ పుణ్యమా అని.. కంచుకోటల్ని బద్దలు కొట్టేందుకు ఇద్దరు నేతలు బయలుదేరారు. మరి ఎవరి ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి మరి.