Choppadandi Constituency: గ్రౌండ్ రిపోర్ట్ : అధికార “కారు”లో కుత కుత; చొప్పదండిలో ఏందీ కథ?

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా ఉన్న కంసాల శ్రీనివాస్ చొప్పదండి అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆయన తన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ ప్రాంతంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Written By: Bhaskar, Updated On : July 16, 2023 12:31 pm

Choppadandi Constituency

Follow us on

Choppadandi Constituency: ఒక పర్యాయం ఒక మహిళ ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమెపై అవినీతి ఆరోపణలు రావడంతో మరో విద్యావేత్తకు టికెట్ దక్కింది. ఇప్పుడు ఆయనపై కూడా విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు పార్టీ నిర్వహించిన రహస్య సర్వేలో ఆయనపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వకుండా కొత్త ముఖానికి అవకాశం కల్పించాలని పార్టీ అధినేత భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ జాబితాలో ఉన్న ఒక ఆశావహుడు ఏకంగా వాల్ రైటింగ్ చేస్తున్నాడు. సామాజిక కార్యక్రమాలతో దూసుకెళ్తున్నాడు. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఒక్కసారిగా నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఎందుకు మారింది? మరీ ముఖ్యంగా అధికార పార్టీలో ఇంత కుదుపు దేనికి వచ్చింది?

పోటాపోటీ

ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో చొప్పదండి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రాంతం విప్లవ ఉద్యమాలకు పురిటి గడ్డ. 2014 ఎన్నికల్లో శంకరపట్నం జడ్పిటిసిగా ఉన్న బొడిగె శోభను అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత భారత రాష్ట్ర సమితి బరిలోకి దింపింది. ఆమె తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద శోభ విజయం సాధించింది. అయితే ఆమె మీద అవినీతి ఆరోపణలు రావడంతో కెసిఆర్ 2018లో జరిగిన ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె కేసీఆర్ పై వ్యతిరేక స్వరం వినిపించారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. బొడిగె శోభ స్థానంలో ఓ ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్, ఉద్యమ నేతగా ఉన్న సుంకే రవిశంకర్ కు కెసిఆర్ టికెట్ ఇచ్చారు. గులాబీ వేవ్ లో రవిశంకర్ కూడా గెలుపొందారు. ఆయనపై కూడా అనేక రకాల అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే సొంత పార్టీ వారు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన మరోసారి ఎమ్మెల్యేగా ఉంటే తాము పనులు చేయలేమని కాంట్రాక్టర్లు నేరుగా ప్రగతిభవన్ కే ఫిర్యాదు చేశారు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని రవిశంకర్ పై ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి నిర్వహించిన అనేక సర్వేల్లో ఎమ్మెల్యేకు సానుకూలత 35% మించలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీకి అనుకూలంగా నిర్వహించిన వివిధ సర్వేల్లో 50 శాతం మంది అనుకూలంగా ఓటు వేయడం విశేషం. అందువల్లే ఈసారి కూడా చొప్పదండి ఎమ్మెల్యేను మార్చే అవకాశం కనిపిస్తోంది. అధినేత మనసులోనూ ఇదే ఉందని ప్రచారం జరుగుతోంది.

తెరపై కొత్త ముఖాలు

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా ఉన్న కంసాల శ్రీనివాస్ చొప్పదండి అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆయన తన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ ప్రాంతంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చొప్పదండి, గంగాధర మండల కేంద్రాల్లో తన క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. గోడలపై రైటింగ్స్ కూడా రాయిస్తున్నారు. ఇక మాజీ ఎంపీటీసీ బండపల్లి యాదగిరి కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల మద్దతును ఆయన కూడగడుతున్నారు. ఇక భారత రాష్ట్ర సమితికి చెందిన పలువురు నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆయన కలిసి తనకు సహకరించాలని కోరుతున్నారు. ఇక ఈ నియోజకవర్గానికి చెందిన బోయినపల్లి జెడ్పిటిసి భర్త కత్తెరపాక కొండయ్య కూడా ఇదే రీతిలో వివిధ గ్రామాల్లో ప్రచారం సాగిస్తున్నారు.. కొండయ్యకు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అండదండలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ కాలంలో గాయనిగా క్రియాశీల పాత్ర నిర్వహించిన వల్లాల వాణి కూడా చొప్పదండి టికెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఆమె టికెట్ బరిలో ఉన్నప్పటికీ అవకాశం దక్కలేదు.

ముక్కోణపు పోటీ అనివార్యం

టికెట్ ఆశిస్తున్న బండపల్లి యాదగిరి, కొండయ్య నియోజకవర్గం చెందినవారు. మిగతా ఇద్దరు జిల్లాకు చెందిన వారు. వీరంతా కూడా సుంకే రవిశంకర్ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో సొంత పార్టీ నుంచి, అంత సామాజిక వర్గం నుంచి ఆయన పోటీ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక కాంగ్రెస్, బిజెపి లకు చెందిన అభ్యర్థులు కూడా బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రకారం ఈ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ అనివార్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన మేడిపల్లి సత్యం, బిజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పోటీలో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మరికొద్ది నెలలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చొప్పదండిలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి.