Speaker Tammineni Sitaram: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదా? వైసిపి అధినాయకత్వం టిక్కెట్ ఇచ్చేందుకు విముఖత చూపుతోందా? ఎంపీగా పోటీ చేయమని ఆదేశించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు చూస్తే ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆమదాలవలస నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన సీతారాం గెలుపొందారు. క్యాబినెట్ లో బెర్త్ ను ఆశించారు. జగన్ మాత్రం ఆయనను పెద్దన్న పాత్ర పోషించమని చెప్పి.. స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. అయిష్టతగానే ఆ సీట్లో కూర్చున్న తమ్మినేని ఎలాగోలా ఐదేళ్లు గడిపేశారు. మరోసారి ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధపడుతున్నారు.
2024 ఎన్నికల్లో తమ్మినేని సీతారాంకు ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది. జగన్ చేయించిన అన్ని సర్వేల్లో ఆయనకు ప్రతికూల ఫలితమే వస్తోంది. తమ్మినేని మాత్రం తాను ఈసారి తప్పుకొని.. కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతున్నారు. అయితే తమ్మినేని కుటుంబంలో ఎవరు నిలబడినా ఓటమి తప్పదని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. అందుకే ఒక కొత్త ముఖం కోసం హై కమాండ్ వెతుకుతున్నట్లు తెలుస్తోంది.అయితే తమ్మినేని మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అధినేత జగన్ ను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు.
అయితే హై కమాండ్ ఓ ఆప్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే తమ్మినేని మాత్రం తనకు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని ఖరాఖండిగా తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో సిట్టింగ్ ఎంపి రామ్మోహన్ నాయుడు మరోసారి బరిలో దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న నేపథ్యం, రామ్మోహన్ నాయుడుకు వ్యక్తిగత చరిష్మ ఉండడంతో.. తమ్మినేని భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎంపీ కంటే ఎమ్మెల్యే సీటు సేఫ్ అని భావిస్తున్నారు. కానీ తమ్మినేనికి టిక్కెట్ ఇస్తే ఒక సీటు వదులుకోవాల్సి వస్తుందని జగన్ భయపడుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు స్పీకర్ సెంటిమెంట్ తమ్మినేని కి కొనసాగుతోంది. గతంలో స్పీకర్లుగా వ్యవహరించిన చాలామంది క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. యనమల రామకృష్ణుడు, ప్రతిభ భారతి, కోడెల శివప్రసాద్ ల ఉదంతమే ఇందుకు నిదర్శనం. వారు స్పీకర్లుగా ఉంటూ తర్వాతే ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు తనకు ఆ పరిస్థితి వస్తుందని తమ్మినేని తెగ భయపడుతున్నట్లు తెలుస్తోంది.