Southwest Monsoon: మండుతున్న ఎండ.. విపరీతమైన వేడి.. భరించలేని ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దక్షిణాది ప్రజలకు భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) శుభవార్త చెపిపంది. నైరుతి రుతుపవనాలు గురువారం(మే 30న) కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది. లక్ష్యద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి, తర్వాత ఐదు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
భానుడి ఉగ్రరూపం..
మరోవైపు భానుడు దేశంలో ఉగ్రరూపం దాల్చాడు. రోహిణి కార్తెకు తోడు రెమాల్ పుఫాన్ తోడవడంతో రెండు రోజులుగా నిప్పులు కురిపిస్తున్నాడు. దేశమంతటా 45 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాదిన 50 డిగ్రీలకు చేరువలో నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలు రెండు రోజులుగా నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలతో పోటీ పడుతున్నాయి. ఏపీలోని విశాఖలో బుధవారం(మే 22 ) ఉదయం 7 గంటలకే ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటింది. వేడి, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధిక వేడి కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు హీట్ ఎక్కుతున్నాయి. దీంతో విద్యుత్ అధికారులు మధ్యాహ్నం వేళ అవి పేలిపోతాయని కాసేపు సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత 45.7 డిగ్రీలు మంచిర్యాల జిల్లాలో నమోదు కాగా, ఏపీలో ఒంగోలులో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.
మూడు రోజులు ఇదే పరిస్థితి..
రానున్న మూడు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్టంగా 47 డిగ్రీలు వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పెరుగుతున్న వడదెబ్బ మృతులు..
మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులకు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి. వారం క్రితం వాతావరణం చల్లబడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో కూలీలు, వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం(మే 29న) పదుల సంఖ్యలో వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి.