AP Elections 2024: ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయత ఎంత?

తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. కానీ చాలా వరకు సంస్థలు అక్కడ అధికార పార్టీ వైపు మొగ్గు చూపాయి. దీంతో వాటి క్రెడిబిలిటీ దెబ్బతింది.

Written By: Dharma, Updated On : May 30, 2024 10:00 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఏపీలో హై టెన్షన్ నెలకొంది. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? చంద్రబాబుకు ప్రజలు ఛాన్స్ ఇచ్చారా? ఎక్కడ చూసినా ఇదే చర్చ. జూన్ 4న ఫలితాలు వస్తాయి. కానీ అంతకంటే ముందే ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వస్తాయి. అయితే గతంలో ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలకు క్రెడిబిలిటీ ఉండేది. కానీ ఈసారి పార్టీలు, మీడియాలు విభజించి మరి ఎగ్జిట్ పోల్ సర్వేలు వస్తున్నాయి. దీంతో దేనిని నమ్మాలో.. దేనిని నమ్మకూడదో తెలియడం లేదు. అయితే ఇప్పటికే ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు పార్టీల అధినేతలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని సర్వేలు వైసీపీకి మరోసారి ఛాన్స్ ఉంటుందని చెప్పగా.. మరి కొన్ని సర్వేలు టిడిపి కూటమికి అనుకూల ఫలితాలు ఇచ్చాయి. అంటే ఎగ్జిట్ పోల్ సర్వేలు సైతం సరిగ్గా ప్రజల పల్స్ ను పట్టలేకపోయాయన్నమాట.

తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. కానీ చాలా వరకు సంస్థలు అక్కడ అధికార పార్టీ వైపు మొగ్గు చూపాయి. దీంతో వాటి క్రెడిబిలిటీ దెబ్బతింది.అయితే ఏపీ విషయంలో చాలా సర్వే సంస్థలు రెండేళ్ల ముందు నుంచే సర్వే చేస్తూ వచ్చాయి. ఏకపక్షంగా వైసీపీకి అధికారం దక్కుతుందని అంచనా వేసాయి. అదే సమయంలో కొన్ని అస్మదీయ సంస్థలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గతంలో వినని సంస్థల పేర్లు సైతం సర్వేల పేరిట బయటపడటం విశేషం. దీనికి తోడు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం కూడా అధికం అయ్యింది. అందుకే ప్రజలు కూడా ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన ప్రజలు పెద్దగా విశ్వసించని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఫేక్ సంస్థలు రంగంలోకి దిగినట్లు సమాచారం. అందుకే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఎవరూ విశ్వసించవద్దని ఓ పార్టీ అంతర్గతంగా శ్రేణులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ట్రాక్ రికార్డు సరిగ్గా ఉన్న ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల ఫలితాలు ప్రభావం చూపే అవకాశం ఉంది. మొన్నటికి మొన్న తెలంగాణ, ఆ ముందు కర్ణాటక ఎన్నికల్లో కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు ప్రకటించిన ఫలితాలకు దగ్గరగా వాస్తవ ఫలితాలు వచ్చాయి. ఎన్నికలకు మూడు నెలల ముందు అట్టడుగున ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా.. ఎవరు నమ్మలేదు. కెసిఆర్ హ్యాట్రిక్ కొడతారని అంతా భావించారు. కానీ అక్కడ సీన్ మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయాలకు భిన్నంగాకర్ణాటక,తెలంగాణలో ఫలితాలు వచ్చాయి. ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ పై ఆశగా ఉన్నా.. ఎక్కువమంది మాత్రం జూన్ 4న వచ్చే ఫలితాల కోసమే ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.