మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలన ఏ స్థాయిలో ఉందో 2019 ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ ఓటమికి ఆంధ్రజ్యోతి కూడా ఒక కారణం. ఏపీలో అభివృద్ధి జరగకపోయినా జరిగినట్లు, ప్రజలు తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు, ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నట్లు ఆంధ్రజ్యోతి ప్రచారం చేసింది.
ఆంధ్రజ్యోతి ఐదేళ్ల చంద్రబాబు పాలన గురించి ఏపీలో అభివృద్ధి జరిగిపోయిందని కథనాలు వండి వార్చినా ప్రజలు మాత్రం వాటిని నమ్మలేదు. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆంధ్రజ్యోతి జగన్ సర్కార్ పై విషం కక్కడం ఆపలేదు. రంగులు మార్చడంలో ఊసరవెల్లితో పోలిస్తే తానే ముందుంటానని ఆంధ్రజ్యోతి ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తోంది. 24 గంటల్లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన రెండు కథనాలు ఆ పత్రిక యూటర్న్ కు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
“అరాచకానికి అడుగే దూరం” అనే పేరుతో నిన్న ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ లో విశ్లేషకులు, తటస్థులు జగన్ సర్కార్ గురించి కామెంట్ చేయాలంటే గజగజా వణికిపోతున్నారని…. ప్రభుత్వ విధానాల్లోని తప్పులను ఎత్తిచూపిన వాళ్లపై అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని కథనం ప్రచురితమైంది. అయితే 24 గంటల్లోనే ఆ కథనానికి యూటర్న్ తీసుకుని మరో కథనాన్ని ప్రచురించింది.
“అధికారి అతి యవ్వారం” పేరుతో ఈరోజు ఆంధ్రజ్యోతి మరో కథనాన్ని ప్రచురించి జగన్ సర్కార్ మద్యం నుంచి గనుల వరకు దందాకు పాల్పడుతోందని, కోర్టుల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయని, పార్టీలు, సంస్థలు, వ్యవస్థలు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయని… మేధావులు, విశ్లేషకులు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారని కథనం ప్రచురించింది. నిన్న తటస్థులు, విశ్లేషకులు గజగజా వణికిపోతున్నారని రాసిన ఆంధ్రజ్యోతి నేడు యూటర్న్ తీసుకోవడం దేనికి సంకేతమో రాధాకృష్ణే చెప్పాలి.