https://oktelugu.com/

సోము వీర్రాజు సారధ్యంలో బిజెపి దిశ మారనుందా?

ఎట్టకేలకు ఆంధ్ర బిజెపి కి కొత్త సారధి నియామకం జరిగింది. ఒక వారంలోపల కొత్త అధ్యక్షుడు వస్తాడని మేము ఈ కాలమ్స్ లో ముందుగానే చెప్పాము. మేము చెప్పినట్లుగానే కొత్త అధ్యక్షుడి నియామకం ఈవారంలో జరిగింది. వాస్తవానికి ఈపని ఎప్పుడో జరగాల్సింది. ‘బెటర్ లేట్ దేన్ నెవ్వర్’అని సరిపెట్టుకుందాం. ఇదేపని కంభంపాటి హరిబాబు స్థానం లో అప్పుడే చేసివుంటే ఇప్పటికి బిజెపి ఒక స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో వుండి వుండేది. కన్నా లక్ష్మీనారాయణ నియామకం పెద్ద అపశ్రుతి. […]

Written By:
  • Ram
  • , Updated On : July 28, 2020 / 01:04 AM IST
    Follow us on


    ఎట్టకేలకు ఆంధ్ర బిజెపి కి కొత్త సారధి నియామకం జరిగింది. ఒక వారంలోపల కొత్త అధ్యక్షుడు వస్తాడని మేము ఈ కాలమ్స్ లో ముందుగానే చెప్పాము. మేము చెప్పినట్లుగానే కొత్త అధ్యక్షుడి నియామకం ఈవారంలో జరిగింది. వాస్తవానికి ఈపని ఎప్పుడో జరగాల్సింది. ‘బెటర్ లేట్ దేన్ నెవ్వర్’అని సరిపెట్టుకుందాం. ఇదేపని కంభంపాటి హరిబాబు స్థానం లో అప్పుడే చేసివుంటే ఇప్పటికి బిజెపి ఒక స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో వుండి వుండేది. కన్నా లక్ష్మీనారాయణ నియామకం పెద్ద అపశ్రుతి. ఆంధ్ర ప్రజలు దాన్ని హర్షించలేదు. సామాజిక కోణంలో అతిపెద్ద కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తిని నియమించటం సరైన వ్యూహమయినా సోము వీర్రాజు ని పక్కన పెట్టటానికే కన్నా పేరును కావాలని కొంతమంది పైకి తీసుకొచ్చారని అప్పుడే ఆనోటా ఈ నోటా వినబడింది. ఇన్నాళ్ళకు లేటయినా బిజెపి నాయకత్వం తన తప్పు ని సరిదిద్దుకుని తిరిగి బిజెపి ని పట్టాల మీద పెట్టిందని పరిశీలకుల భావన.

    Also Read: కన్నాపై వేటుకు కారణాలు ఏంటీ?

    సోము వీర్రాజు మొదట్నుంచీ బిజెపి సిద్దాంతాల కోసం కట్టుబడి పనిచేసిన వ్యక్తి. బిజెపి యువ మోర్చా అధ్యక్షుడి గా, ప్రధాన కార్యదర్శిగా పనిచేయటం, ఆర్ఎస్ ఎస్ శాఖల్లో పనిచేయటం, వ్యవసాయ కుటుంబం నుంచి రావటం, కాపు సామాజిక వర్గం అధికంగా వున్న తూర్పు గోదావరి జిల్లా కు చెందటం, గత ప్రభుత్వం లో చంద్రబాబు ప్రభుత్వం లో భాగస్వామిగా వున్నా బిజెపి వాణి ని మండలి లో గట్టిగా వినిపించటం లాంటి అంశాలు తన వైపు అధిష్టానం మొగ్గు చూపటానికి కలిసొచ్చిన అంశాలని అర్ధమవుతుంది. ఒక సందర్భంలో సోము వీర్రాజు పేరు ఈసారి కూడా వెనక్కుపోయిందని  కొంత ప్రచారం జరిగింది. దానికి కూడా కొత్త కారణాలతో లాబీ జరిగిందని వినికిడి. పవన్ కళ్యాణ్ తో బిజెపి పొత్తు పెట్టుకోవటం తో కాపు సామాజిక వర్గానికి ఇచ్చేదానికన్నా వెనకబడిన కులాలకి చెందిన వ్యక్తి కి ఇస్తే బాగుంటుందని కాపు సామాజిక వర్గం ఎటూ కలిసివస్తుందని ప్రచారం జరిగింది. చివరకు బిసి వ్యక్తి పేరు ని కూడా మీడియా లో ప్రచారం చేసారు. ఇదంతా ఓ పద్దతి ప్రకారం సోము వీర్రాజు రాకుండా చేయటానికే జరిగిందని తెలుస్తుంది. అయినా బిజెపి కేంద్ర నాయకత్వం ఈసారి ఆ ట్రాప్ లో పడకుండా సోము వీర్రాజు వైపే మొగ్గు చూపటం ఆంధ్ర బిజెపి కి శుభ ఘడియలు వచ్చాయనిపిస్తుంది.

    బిజెపి నూతన అధ్యక్షుడిగా జెపి నడ్డా ఎన్నికైన తర్వాత అన్ని రాష్ట్రాలకు నూతన అధ్యక్షుల్ని నియమించటం జరుగుతుంది. అందులో భాగంగా తెలంగాణా కి డాక్టర్ లక్ష్మణ్ స్థానం లో బండి సంజయ్ కుమార్ ని నియమించారు. బండి సంజయ్ కూడా సోము వీర్రాజు లాగా ఎప్పట్నుంచో నిబద్దతతో ఆర్ఎస్ ఎస్ , బిజెపి లో పని చేస్తూ వచ్చాడు. ఇటీవలికాలంలో ఎంతోమంది అతిరధ మహారధులు ఇతర పార్టీల నుంచి వచ్చినా మొదట్నుంచీ పార్టీనే నమ్ముకున్న బండి సంజయ్ కే అధ్యక్ష పీఠం దక్కింది. తనుకూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాడే. అంటే అటు తెలంగాణా లో , ఇటు ఆంధ్ర లో బిజెపి కాపు సామాజిక వర్గానికి పెద్ద పీట వేసిందని చెప్పొచ్చు. అలాగే బిజెపి కేంద్ర నాయకత్వం ఇంకో సంకేతం కూడా ఇచ్చింది. కొత్త వాళ్ళు ఎంతమంది చేరినా ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకొని వున్నవాళ్ళను వదిలిపెట్టేది లేదని స్పష్టంగా ఇటీవల నియామకాల్లో స్పష్టం చేసింది. ఆంధ్ర, తెలంగాణా లో కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా అదే సంకేతాలు ఇస్తుంది. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ తర్వాత రెండో స్థానం లో వున్న ముకుల్ రాయ్ పార్టీలో చేరినా అక్కడా పాత వాళ్ళను వదిలిపెట్టలేదు. అందుకే ముకుల్ రాయ్ అసంతృప్తిగా వున్నట్లు తెలుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో అనూహ్యంగా దళితుడ్ని అధ్యక్షుడిగా చేసింది. గుజరాత్ లో గుజరాతీని కాకుండా ఓ మరాఠీ ని అధ్యక్షుడని నియమించింది. అలా సంచలనాత్మక నిర్ణయాలతో నిర్మాణాన్ని పటిష్టం చేస్తుంది. ఇక మిగిలిందల్లా అత్యున్నత పార్లమెంటరీ బోర్డు నియమకమే. అది కూడా అతి త్వరలోనే జరగబోతుందని తెలుస్తుంది.

    Also Read: సోనూ సూద్ సాయం నుంచి గుణపాఠాలివీ

    ఆంధ్ర ప్రదేశ్ కొచ్చేసరికి 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశంలోని ముఖ్యనేతలు, చంద్రబాబు నాయుడు కుడి, ఎడమ భుజాల్లాంటి వాళ్ళు బిజెపి లో చేరటం తెలిసిందే. అయినా వాళ్ళు ఇక్కడకూడా చంద్రబాబు నాయుడు బి టీం లాగానే పనిచేస్తున్నరనేది బహిరంగ రహస్యమే. అధికారం కోల్పోయిన తర్వాత వై ఎస్ ఆర్ పి ని తట్టుకొని నిలబడాలంటే బిజెపి అండకావాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడే వీళ్ళను పంపించాడని అందరూ అనుకుంటున్నారు. అదేసమయంలో ఆంధ్ర బిజెపి లోనూ వీళ్ళు చక్రం తిప్పుదామని పధకం వేసారు. వీళ్ళే సోము వీర్రాజు కాకుండా వుండాలని శతవిధాల ప్రయత్నం చేసారని తెలుస్తుంది. పోయినసారి కాపు కార్డుని కాపు కార్డు తోనే దెబ్బతీయాలని కన్నా ని తీసుకోచ్చినట్లే ఈసారి పవన్ కళ్యాణ్ జత కూడటాన్ని అడ్డంపెట్టుకొని బిసి కార్డుని ముందుకు తీసుకొచ్చి తనకనుకూల వ్యక్తి ని అధ్యక్షుడ్ని చేయాలని ప్రయత్నం చేసారని తెలుస్తుంది. బిజెపి అగ్రనాయకత్వాన్ని బుట్టలో వేసుకోవటం కాంగ్రెస్ ని వేసుకున్నంత తేలిక కాదని ఇప్పటికే అర్ధమై వుంటుంది. మరి వీరి తదుపరి కార్యక్రమమేమిటో కొద్ది రోజులు పోతేగానీ తెలియదు.

    సోము వీర్రాజు 1978 లోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. తన దగ్గర కోట్ల రూపాయలు లేకపోయినా కోట్ల రూపాయలతో సమానమైన క్యాడర్ విశ్వాసం పుష్కలంగా వుంది. ఇప్పుడు తనముందు పెద్ద భాద్యతే వుంది. రాష్ట్ర కమిటీ ని పునర్వ్యవస్తరీకరించటం లో తగు జాగ్రత్తలు తీసుకొని నిబద్ధులైన కార్యకర్తలను ప్రోత్సహించాల్సిన అవసరం వుంది. ఎటూ ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు కాబట్టి నిర్మాణం పై పూర్తి దృష్టి సారించి బిజెపి ని వీలైనన్ని ప్రాంతాలకు విస్తరించటం పై కేంద్రీకరిస్తే బెటర్. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన తో కలిసి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకుంటే మంచి భవిష్యత్తు వుంటుంది. పోయిన ఎన్నికల్లో చతికిల పడిన తెలుగుదేశం తిరిగి లేచే అవకాశాలు దాదాపు లేనట్లే. ఇది మూడో ప్రత్యామ్నాయానికి మంచి అవకాశం. సరైన కార్యాచరణ తో ముందుకెళ్తే బిజెపి-జనసేన ఆంధ్రలో జగన్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం వుంది. ఆ అవకాశాన్ని సోము వీర్రాజు జారవిడుచుకోడని ఆశిద్దాం.