Homeజాతీయ వార్తలురెండు గంటల వ్యవధిలోనే స్కెచ్‌..: విచారణలోకి ఉన్నతాధికారులు

రెండు గంటల వ్యవధిలోనే స్కెచ్‌..: విచారణలోకి ఉన్నతాధికారులు

Lawyer Couple
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్యకు రెండు గంటల వ్యవధిలోనే స్కెచ్‌వేసి.. అమలు చేశారు. తలనొప్పిగా మారిన న్యాయవాది వామన్‌రావును హతమార్చాలని ఎప్పటి నుంచో మాజీ ఎంపీటీసీ కుంట శ్రీనివాస్‌ ఎదురుచూస్తున్నాడు. అయితే కుంట శ్రీనుకు 2 గంటల్లోనే పూర్తి సహకారం అందించి ‘కథ’ ముగించింది మాత్రం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను. ఈ నెల 17న ఉదయం 11.30 గంటల తర్వాత న్యాయవాద దంపతులు మంథని కోర్టుకు వచ్చి మధ్యాహ్నం 1.30–2.00 గంటల సమయంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. 2.30 గంటల ప్రాంతంలో రామగిరి మండలం కల్వచర్ల వద్ద దాడి జరిగింది. వామన్‌రావు దంపతులు కోర్టుకు వచ్చిన తర్వాతే మర్డర్‌ ప్లాన్‌ జరిగినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వామన్‌రావు కోర్టులో ఉన్నంత సేపు అతడి కదలికలను ఎప్పటికప్పుడు నిందితుడు కుంట శ్రీనివాస్‌కు చేరవేయగా, బిట్టు శ్రీనుతో కలసి ఎక్కడ చంపాలనే విషయమై ప్లాన్‌ చేసి, అమలు చేశారు.

Also Read: ప్రతీకారం బిట్టు శ్రీనుదా..? కుంట శ్రీనుదా..? : పాలుపంచుకున్నదెవరు..?

అయితే.. ఈ మర్డర్లలో నిందితుల బరితెగింపుపై ఇప్పుడు అంతటా అనుమానాలు కలుగుతున్నాయి. మంథని నియోజకవర్గంలో కొందరు పోలీసు అధికారులు రాజకీయ నేతలతో మితిమీరిన స్నేహం కొనసాగిస్తుండడమే నిందితుల ధీమాకు కారణాలని పలువురు బహిరంగంగానే అంటున్నారు. కొందరు పోలీసుల సహకారంతో తప్పించుకోగలుగుతామనే ధైర్యంతోనే వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అంటున్నారు. నేరస్థలంలో ఆధారాలను జాగ్రత్తగా కాపాడడంలో పోలీసులు నిర్లక్ష్యం వైఖరి ప్రదర్శించడం కూడా ఈ ప్రచారానికి మరింత బలం తెస్తోంది.

ఇదిలా ఉండగా.. జంట హత్యల అనంతరం పరిణామాలు వేగంగా మారిపోవడంతో నిందితుల ఎత్తులన్నీ చిత్తయినట్లుగా తెలుస్తోంది. ఈ కేసు రాజకీయ రంగు పులుముకోవడం.. న్యాయవాదుల ఆందోళన, సత్వర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించడంతోపాటు డీజీపీ మహేందర్‌‌ రెడ్డి స్వయంగా కేసు దర్యాప్తును సమీక్షించాల్సి వచ్చింది. ప్రజలకు అనుమానాలు రాకుండా కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలని ఆదేశించారు. డీజీపీ స్వీయ పర్యవేక్షణతో పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

Also Read: మళ్లీ కోరలు చాస్తున్న మహమ్మారి

స్థానిక పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టి ‘జాగ్రత్త’గా మసులుకోవడం మొదలుపెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను పేరు తెరపైకి వచ్చిందనే చర్చ నడుస్తోంది. అంతేకాదు.. ఐజీ నాగిరెడ్డి ప్రెస్‌ మీట్‌ పెట్టి బిట్టు శ్రీను పేరు వెల్లడించే వరకు కూడా ఇందులో ఆయన ప్రమేయం ఉన్నట్లుగా ఎవరికీ తెలియదు. మున్ముందు ఈ కేసులో మరెంత మంది కీలక వ్యక్తుల పేర్లు బయటకు వస్తాయా అని ఉత్కంఠగా మారింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

Exit mobile version