Sitaram Yechury : సీతారాం ఏచూరికి అంత్య క్రియలు జరపడం లేదు.. కారణమేంటంటే..

ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ.. ఢిల్లీలోని ఏం ఆస్పత్రిలో కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి గురువారం కన్నుమూశారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు నేతలు ఆయన స్వగృహానికి చేరుకుంటున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 12, 2024 9:10 pm

Sitaram Yechury

Follow us on

Sitaram Yechury : సీతారాం ఏచూరి కన్నుమూయడంతో కమ్యూనిస్టు పార్టీ ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. సీతారాం ఏచూరి మృతి నేపథ్యంలో కమ్యూనిస్టు దిగ్గజ నాయకులు ఢిల్లీ వెళ్ళిపోయారు. సీతారాం ఏచూరి పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అయితే సీతారాం ఏచూరికి అంత్యక్రియలు నిర్వహించడం లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సీతారామ్ ఏచూరి తన బతికి ఉన్నప్పుడు.. ఒకవేళ తాను చనిపోతే తన పార్థివ దేహాన్ని వైద్య పరీక్షల కోసం.. వైద్య విద్యార్థుల పరిశోధన కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన పార్థివ దేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య కళాశాలకు ఇస్తున్నామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.. దానికంటే ముందు సీతారాం ఏచూరి పార్థివదేహాన్ని ఆయన స్వగృహానికి తరలించారు. కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, నేతలు, అనుచరులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. ఇంకా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వగృహంలో సీతారాం ఏచూరి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత.. అంత్యక్రియలు నిర్వహించకుండా.. ఆయన పార్థివ దేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య కళాశాలకు దానం చేస్తామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు..

సీతారాం ఏచూరి గత కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. గతంలో ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. ఇటీవల మళ్ళీ తిరగబెట్టడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తులు పని చేయకపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆయన ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. అది ఆయన గుండె పనితీరుపై ప్రభావం చూపించిందని.. అందువల్లే ఆయన ప్రాణాలను కాపాడుకోలేకపోయామని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా ఆయన వెంటిలేటర్ పై ఉన్నారు. ఆయన ప్రాణాలను కాపాడేందుకు ఎయిమ్స్ వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. సీతారాం ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను హెల్త్ బులెటిన్ లలో ఎప్పటికప్పుడు ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. కాగా, సీతారాం ఏచూరి కన్నుమూతతో పార్టీ ఒక దిగ్గజాన్ని కోల్పోయిందని కమ్యూనిస్టు నేతలు వ్యాఖ్యానించారు. ఆయన మృతి కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు.

సీతారాం ఏచూరి ఉన్నత విద్యావంతుడు. ఢిల్లీలో చదువుకుంటున్నప్పుడు విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేశారు. అదే సమయంలో ఎస్ఎఫ్ఐ లో చేరారు. వామపక్ష విద్యార్థి సంఘం బలోపేతానికి కృషి చేశారు. ఢిల్లీలోనే జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని వామపక్ష విద్యార్థి సంఘానికి అడ్డాగా మార్చారు. విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేశారు. ప్రకాష్ కరత్ సహకారంతో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి సంఘాన్ని పటిష్టం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ విద్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ యూనియన్ కు గుమ్మం లాగా మార్చారు. సీతారాం ఏచూరి వేసిన పునాదుల వల్లే నేడు ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో జరిగే విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ విజయాలు సాధిస్తుంది.