Chandrababu: ఏపీలో టీడీపీ ప్రభంజనం వీస్తోందని చంద్రబాబు ప్రకటించారు. అదే నిజమైతే పొత్తుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత కొద్దిరోజులుగా చంద్రబాబు ఢిల్లీ టూర్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణతో పాటు దొంగ ఓట్ల నమోదుపై ఈసీకి ఫిర్యాదు చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు ప్రముఖులను కలుసుకున్నారు.
ఈ తరుణంలో చంద్రబాబు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై సానుకూల ధోరణితో మాట్లాడారు. అయితే బిజెపి కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్లు వ్యాఖ్యలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బిజెపితో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. అప్పట్లో ప్రత్యేక హోదా కోసం అడగడంతోనే గొడవ జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో పొత్తులపై కాలమే నిర్ణయిస్తుందని జోస్యం చెప్పారు. పొత్తులు పెట్టుకోవడం టీడీపీకి కొత్త కాదని… ఇప్పటివరకు అయితే పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
అయితే ఒకవైపు టిడిపి ప్రభంజనం వీస్తుందని చెబుతూనే.. చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడటం విమర్శలకు తావిస్తోంది. ప్రభంజనం వీస్తుంటే పక్క పార్టీలతో అంటకాగాల్సిన పని ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పొత్తులు ఉంటాయని చెప్పడం ద్వారా.. జగన్ బలమైన శక్తిగా జాతీయ మీడియా ఊహించేలా చంద్రబాబు చర్యలు ఉన్నాయి. వైసిపి బలంగా ఉండడంతోనే చంద్రబాబు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారని ఊహాగానాలు ఢిల్లీలో కమ్ముకుంటున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అండ కోసమే ఏపీలో ఏమాత్రం బలం లేని బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు పాడరాని పాట్లు పడుతున్నారని ఢిల్లీలో టాక్ నడుస్తోంది.
అయితే తెలంగాణలో ఒకలా.. ఏపీలో మరోలా చంద్రబాబు పొత్తులకు వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే సమయం మించిపోయినందున బిజెపితో పొత్తులు ఉండవని సంకేతాలు ఇచ్చారు. ఏపీలో మాత్రం తప్పకుండా పొత్తులు ఉంటాయని తేల్చి చెప్పారు. తెలంగాణలో అన్నిచోట్ల అభ్యర్థులను నిలబెడతామని.. టికెట్లను కన్ఫర్మ్ చేసేందుకు ఒక కమిటీ నియమించినట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణలో పోతుల్లేకుండా.. ఏపీలో మాత్రమే ఉంటాయని చంద్రబాబు చెబుతుండడంలో ఏదైనా ట్విస్ట్ ఉందా అన్న అనుమానం కలుగుతోంది. వాస్తవానికి తెలంగాణలో బిజెపికి సపోర్ట్ చేసి… ఏపీలో వారి సాయం తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది. తెలంగాణలో విడిగా పోటీ చేసి.. ఏపీలో కలుద్దాం అన్న చంద్రబాబు మాటలు అనుమానాలకు తావిస్తున్నాయి. దీనిపైనే సర్వత్ర చర్చ నడుస్తోంది.