చిక్కుల్లో సింగర్ మంగ్లీ .. ఏంటీ ఈ వివాదం?

ప్రముఖ గాయని సత్యవతి అలియాస్ మంగ్లీపై మరో వివాదం చోటుచేసుకుంది. తెలంగాణలో బోనాల పండుగ సందర్భంలో మంగ్లీ పాడిన పాటపై కొద్ది రోజులుగా దుమారం రేగుతోంది. ఈ పాటలో వాడిన పదాలపై ప్రసార మాధ్యమాల్లో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హిందూ సంఘాలు ఆందోళన చేయడంతో బీజేపీ కూడా కల్పించుకుంది. దీంతో వివాదం మరింత ముదురుతోంది. దీనిపై మంగ్లీ తొలిసారి స్పందించారు. తెలంగాణ పండుగలు అంటే తనకు కూడా ఇష్టమేనని చెప్పారు. దేవతల గురించి పాడానని తేల్చిరు. బోనాల […]

Written By: Srinivas, Updated On : July 21, 2021 9:51 am
Follow us on

ప్రముఖ గాయని సత్యవతి అలియాస్ మంగ్లీపై మరో వివాదం చోటుచేసుకుంది. తెలంగాణలో బోనాల పండుగ సందర్భంలో మంగ్లీ పాడిన పాటపై కొద్ది రోజులుగా దుమారం రేగుతోంది. ఈ పాటలో వాడిన పదాలపై ప్రసార మాధ్యమాల్లో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హిందూ సంఘాలు ఆందోళన చేయడంతో బీజేపీ కూడా కల్పించుకుంది. దీంతో వివాదం మరింత ముదురుతోంది. దీనిపై మంగ్లీ తొలిసారి స్పందించారు. తెలంగాణ పండుగలు అంటే తనకు కూడా ఇష్టమేనని చెప్పారు. దేవతల గురించి పాడానని తేల్చిరు.

బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారని మంగ్లీపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కుచెందిన పలువురు బీజేపీ కార్పొరేటర్ల బృందం మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. మంగ్లీ పాటను తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఇక పాట రచయిత గురించి చెబుతూ ఆయనో ఓ 80 ఏళ్ల వృద్ధుడు అని చెప్పారు. పేరు రామస్వామి అని చెప్పుకొచ్చారు. ఆయన తన పదాల పొందికలో ఎలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే ఉద్దేశంతోనే పాటలో మార్పులు చేయలేదని సూచించారు.

పాలమూరు ప్రాంతంలో కోలాటంలో ఈ పాట చాలా ప్రసిద్ధి చెందిందన్నారు. 2008లో ఈ పాటను డీఆర్సీ ఆడియో సంస్థ వారు సీడీ రూపంలో విడుదల చేశారన్నారు. జానపదాలు తెలిసిన వ్యక్తి కావడంతో ఆయనపై ఉన్న అభిమానంతోనే పాటలో మార్పులు చేయలేదని చెప్పారు. 300 జానపదాలతో పాటు గ్రామ దేవత మైసమ్మ మీద ఆయన వంద కోలాటం పాటలు రచించారన్నారు. చెట్టుకింద కూసున్నవమ్మ చుట్టం లెక్క ఓ మైసమ్మ అని సాగే ఈ పాటలో మెతెవరి అనే పదంపై భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. అయితే రచయిత అభిప్రాయంలో మెతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే పదంలో ఉపయోగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పదంపై వాదనలు జరుగుతున్నాయి.

తాను గిరిజన జాతికి చెందిన దానినేనని అన్నారు. బతుకమ్మ బోనాల పండుగల్లాగే మా బంజారాల్లో తీజ్, శీతల్ పండుగల్లో ప్రకృతినే దేవతలుగా పూజిస్తామన్నారు. గ్రామ దేవతలను కొలుస్తామని చెప్పారు. అమ్మవారి కృపతోనే తాను గాయకురాలిగా ఎదిగానని పేర్కొన్నారు. అమ్మవారి దీవెన, ఆంజనేయ స్వామి కృపతోనే ఇంతటి దాన్ని అయ్యానని వివరించారు. ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం లేదని అన్నారు. దేవతల కోసమే పాడాను కాని వారి పట్ల తనకు ఎలాంటి దురభిప్రాయాలు లేవని పేర్కొన్నారు.

నా జాతి, కులం, ప్రాంతపై రకరకాల కామెంట్లు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పాటపై వచ్చిన విమర్శల నేపథ్యంలో పాటను మార్చాలని అనుకున్నా రచయిత రామస్వామిని తక్కువ చేయకూడదనే మార్చలేకపోయామని తెలిపారు. దీన్ని మరింత పెద్దది చేస్తూ కించపరచాలని చూస్తూ వక్రమార్గాలు అనుసరించడం సరైంది కాదని సూచించారు. రచయిత కుటుంబసభ్యుల అనుమతితో పాటలో మార్పులు చేశామని గాయని మంగ్లీ తన అధికారిక సోషల్ మీడియాలో ప్రకటించారు.