Karnataka CM Siddaramaiah: ఇది దాదాపుగా మూడు సంవత్సరాల క్రితం ముచ్చట. అప్పట్లో కర్ణాటక రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ ఏలుతోంది.. యడ్యూరప్ప హవా కొనసాగుతోంది. అధికారపక్షం బండి సాఫీగా సాగాలి అంటే ప్రతిపక్షం బలంగా ఉండకూడదు.. ఆ రాష్ట్ర ప్రతిపక్షంలో డీకే శివకుమార్ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ఉంది. వెంట్రుక వాసిలో తప్పిపోయింది గాని అప్పుడు కూడా కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్రాన్ని ఏలేదే. అయితే దీనంతటికీ కారణం డీకే శివకుమార్. ఆర్థికంగా బలంగా ఉన్నవాడు. ఆకాశం ఇస్తే ఢిల్లీ కాంగ్రెస్ పార్టీని కూడా నడిపించగల సత్తా ఉన్నవాడు. ఇన్ని ఉన్నాయి కాబట్టే యడ్యూరప్ప ప్రభుత్వాన్ని సవాల్ చేయగలిగాడు. ఇది సహజంగానే యడ్యూరప్పకు నచ్చలేదు. కేంద్రంలో ఉన్నది కూడా తన ప్రభుత్వమే కాబట్టి అమిత్ టీవీషా లాంటి వారికి ఏదో వర్తమానం పంపాడు. మరుసటి రోజు ఈడీ రంగంలోకి దిగింది. వరుస పెట్టి సోదాలు చేసింది. శివకుమార్ ను తీహార్ జైలుకు పంపించింది. డీకే శివకుమార్ ను నేరుగా సోనియాగాంధీ తీహార్ జైలుకు వెళ్లి పరామర్శించారు. సోనియా గాంధీని చూసి శివకుమార్ కన్నీరు పెట్టుకున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారులకు తీసుకొస్తా అని ఆమెకు మాట ఇచ్చారు. తర్వాత కొద్ది కాలానికి శివకుమార్ జైలు నుంచి విడుదలయ్యారు. సోనియా గాంధీకి ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే విజయమో వీరమరణమో అన్న తీరుగా ప్రచారం చేసిన శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలు గెలిపించుకోవడంలో శక్తి వంచన లేకుండా పనిచేశారు..
అది అతడి చలవే
దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరోగమనం దిశలో వెళ్తున్నప్పుడు కర్ణాటకలో సాధించిన విజయం ఆ పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చింది. అంతేకాదు ఏకంగా 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందేమో అనే సంకేతాలు కూడా ఇచ్చింది.. చాలామంది ఒప్పుకోకపోవచ్చు గాని దీనంతటికీ కీలక కారణమైన వ్యక్తి శివకుమార్. వాస్తవానికి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని జనం నోళ్ళల్లో నానేలా చేసిన వ్యక్తి శివకుమార్. “హిజాబ్ నిరసన నుంచి పేసీఎం” క్యాంపెయిన్ దాకా శివకుమార్ చేసిన కార్యక్రమాలు అన్ని ఇన్ని కావు. సాక్షాత్తు ప్రధానమంత్రి రంగంలోకి దిగినప్పటికీ ఆయన పాచికలు పారలేదంటే శివకుమార్ ఏ స్థాయిలో ఎత్తులు వేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు కావడంతో చాలామంది అభ్యర్థుల ఖర్చు మొత్తం ఆయనే భరించాడు. అంతేకాదు ఈ ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపైనే దృష్టి సారించాడు..కానీ ఇక్కడే కాంగ్రెస్ పార్టీ తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించింది. చాలా తెలివిగా శివకుమార్ ను పక్కనపెట్టింది. తమకు వీర విధేయుడైన సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది.
అడ్డంకిగా కేసులు
కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు, అభ్యర్థులకు సంబంధించి ఖర్చు భరించేందుకు శివ కుమార్ కు రాని అడ్డంకి.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంలో మాత్రం అడ్డు వచ్చింది.. ఆయనపై ఉన్న కేసుల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పడంతో హతాశుడవడం డీకే వంతు అయింది. ఇక ఇన్ని రోజులు ఉత్కంఠ గా మారిన ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారం ఒక కొలిక్కి రాగా.. డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. శివకుమార్ కు కీలకమైన విద్యుత్, నీటిపారుదల శాఖలు కేటాయించే అవకాశం ఉంది. అయితే కేసుల బూచి చూపి శివకుమార్ ను కాంగ్రెస్ కట్టడి చేసిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కర్ణాటక రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలు సాధించాలని, అలా జరగాలంటే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే శివకుమార్ వైపు సోనియాగాంధీ ఉన్నప్పటికీ మెజారిటీ ఎమ్మెల్యేలు, రాహుల్ గాంధీ, మల్లికార్జున కార్గే వంటి వారు సిద్ధరామయ్య వైపు ఉండడంతో ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం అయిపోయింది. సిద్ధరామయ్య గతంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేయడం, విశేషమైన అనుభవం ఉండడంతో ఆయన వైపు కాంగ్రెస్ పార్టీ మొగ్గిందని ప్రచారం జరుగుతోంది. అయితే సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా చేయడంతో శివకుమార్ శిబిరంలో అసంతృప్తి చెలరేగింది. అంతకుముందు శివకుమార్ తనను ముఖ్యమంత్రిని చేయకుంటే సాధారణ ఎమ్మెల్యే గానే ఉంటానని ప్రకటించడంతో అసమ్మతి చెలరేగుతుందని భయంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. దానిని అంతటితోనే చల్లార్చారు. కేసులు, ఇతర వ్యవహారాలను శివకుమార్ ముందు పెట్టి ఆయనను డిఫెన్స్ లో పడేశారు. మొత్తానికి ముఖ్యమంత్రి విషయంలో అడ్డు చెప్పకుండా చేశారు. బహుశా ఈ ఎపిసోడ్ తో శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో తెలిసిపోయింది అనుకుంటా!
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Siddaramaiah is the new chief minister of karnataka official announcement soon
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com