Homeజాతీయ వార్తలుOnline Loan Apps: ఆన్ లైన్ లోన్ యాప్ లను రద్దు చేయాల్సిందేనట?

Online Loan Apps: ఆన్ లైన్ లోన్ యాప్ లను రద్దు చేయాల్సిందేనట?

Online Loan Apps: ఆన్ లైన్ లోన్ యాప్ లను రద్దు చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ యాప్ ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వారి ఆత్మహత్యలకు దారితీస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు డిమాండ్ చేశారు. సామాన్యులపై ఆన్ లైన్ లోన్ యాప్ లు, వారి లోన్ రికవరీ ఏజెంట్ల భరించలేని వేధింపులు, చట్టవిరుద్ధమైన విధానాలు, క్రూరమైన దురాగతాలను మీ దృష్టికి తీసుకువస్తున్నానని తెలిపారు. ఈ సమస్య రోజురోజుకూ పెద్దదవుతూ అనేకమంది అమాయకుల ఆత్మహత్యలు, చావులకు దారి తీస్తోందన్నారు. కోవిడ్ మహమ్మారి అన్ని రంగాలలోని ప్రజల జీవితాలను నాశనం చేసిందని, చాలా మంది ఆర్థికంగా విచ్ఛిన్నమయ్యారని వాపోయారు. అంతేకాకుండా క్షీణిస్తున్న ఆర్థిక వృద్ధి, ఉద్యోగుల తొలగింపు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దేశంలో కొత్త ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల కొరత కోట్లాది మంది భారతీయులను తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టాయన్నారు. ఈ కష్టకాలంలో సామాన్యులను ఆదుకోవాల్సిన సాధారణ బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా విఫలం కావడంతో చాలా మంది ప్రజలు దుర్భరమైన సుడిగుండంలోకి ప్రవేశిస్తున్నారని తెలియక, అత్యవసర , కష్ట సమయాల్లో రుణాల కోసం ఆన్లైన్ లోన్ యాప్ లను ఆశ్రయించారని శ్రావణ్ తెలిపారు..

ఈ ఆన్లైన్ యాప్ లు అధిక వడ్డీ రేట్లకు లోన్లు, ప్రాసెసింగ్ ఫీజు, ఆలస్య రుసుము, ఇతర సాకులతో విపరీతమైన మొత్తాలను వసూలు చేస్తున్నప్పటికీ, సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థ మొండిచేయి చూపడంతో ప్రజలు ఈ రుణ యాప్ లను సంప్రదించవలసి వస్తుందన్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే.. మన ప్రభుత్వ రంగం, ప్రైవేట్ బ్యాంకులు రెండూ డిఫాల్ట్ చేసే పలుకుబడి వున్న వ్యక్తులకు వేల కోట్ల రుణాలను అందజేస్తున్నాయని.. కానీ పేద, మధ్యతరగతి ప్రజలకు అవసరమైన సమయాల్లో చిన్న మొత్తాలను కూడా అందించవు కాంగ్రెస్ నేత నిలదీశారు.

హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బ్యాంకుల్లో కేవలం 900కు పైబడిన పలుకుబడి వున్న వ్యక్తుల సుమారు రూ.1.30 లక్షల కోట్ల రుణ మొత్తాలను ఎగవేసినట్లు ఇండిపెండెంట్ సిటిజన్ గ్రూప్ చేసిన అధ్యయనంలో వెల్లడయ్యింది. కానీ దురదృష్టవశాత్తూ, బ్యాంకులు వివిధ నియమాలు, నిబంధనలను చెబుతూ రూ. 10,000 రుణం కోసం సామాన్యులకు మొండిచేయి చూపిస్తున్నాయని తెలిపారు. సాధారణ బ్యాంకింగ్ వ్యవస్థ వైఫల్యం, ప్రభుత్వాల అసమర్థత కారణంగా ఈ ఆన్లైన్ లోన్ యాప్ లు లక్షలాది మంది అమాయకులు, కష్టజీవులని కొల్లగొడుతున్నాయన్నారు.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ యాప్ లు 30 శాతం నుండి ఊహకందని 200 శాతం వరకు వడ్డీలను వసూలు చేస్తున్నాయన్నారు. వివిధ కారణాలను చూపుతూ అనేక సందర్భాల్లో రెండింతలు, మూడు రెట్లు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నాయి. ఈ యాప్లు చాలా వరకు చట్టవిరుద్ధమైనవి, చట్టపరమైన రిజిస్ట్రేషన్ ను లేకుండా, అనేక అనైతిక పద్ధతులను అవలంబిస్తూ ప్రజలని దోచుకుంటున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల ఒక వ్యక్తి రుణం చెల్లించలేని పక్షంలో రికవరికీ కోసం దారుణంగా బలవంతం చేస్తూ హేయమైన పద్దతులు అనుసరిస్తున్నాయని కేసీఆర్ కు లేఖలో విన్నవించారు.

ఈ ఆన్లైన్ లోన్ యాప్ల రికవరీ ఏజెంట్ల వేధింపుల కారణంగా చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆన్లైన్ యాప్లు ఫిన్టెక్ కంపెనీలుగా కాకుండా మాఫియా సంస్థలుగా పనిచేస్తున్నాయి. రుణాలు పొందిన మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రుణగ్రహీతలను అవమానపరిచేలా వారి పరిచయాలతో వారి చిత్రాలు, వివరాలను షేర్ చేసి చిత్ర హింసలు చేస్తున్నారు. ఈ రికవరీ ఏజెంట్లుగాఎక్కువగా రౌడీషీటర్లు వుంటున్నారు. రుణగ్రహీతల ఇళ్ళపై గూండాలు దాడులు చేస్తున్నారు. ఈ ఆన్లైన్ లోన్ యాప్ ఆపరేటర్లు చేసిన అవమానాన్ని తట్టుకోలేక పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు, ఇతరులతో సహా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నావారి జాబితాలో వున్నారు.

వారం రోజుల క్రితం కూడా ఈఎంఐ చెల్లించని ఓ హైదరాబాదీ మహిళ ఫోటోలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేసి వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గత సంవత్సరం కోవిడ్ సెకెండ్ వేవ్ సమయంలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఆన్లైన్ లోన్ యాప్ల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఒక సాధారణ సంఘటనగా మారాయని చెప్పడం చాలా భాదగా వుంది. ఈ అనైతికమైన ఆన్లైన్ లోన్ యాప్లపై పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. అనేక దారుణమైన సంఘటనలు, బాధితుల నుండి ఫిర్యాదుల తర్వాత కూడా ఈ ఆన్లైన్ లోన్ యాప్లపై ప్రభుత్వం , పోలీసులు చర్యలు తీసుకోకపోవడం ఆర్థిక మోసగాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చినట్లే అవుతుంది. ఇది పైపైన కనిపిస్తున్న పెద్ద సమస్య. పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తే ఆర్థిక మోసాల గుట్టు బయటపడుతుంది.

మేము చేసిన పరిశోధన, విచారణలో 90 శాతానికి పైగా ఆన్లైన్ లోన్ యాప్లు ఎన్బిఎఫ్సి రిజిస్ట్రేషన్, ఏ బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి మద్దతు లేకుండా ఉన్నాయనే షాకింగ్ వాస్తవం వెల్లడైయింది. అనేక మంది బాధితుల నుండి సహాయం కోసం కాల్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్, బెంగళూరు, ముంబై, నోయిడా, గుర్గ్రామ్, పాట్నా, జమర్తాతో పాటు నేపాల్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి దేశాలలో ఈ అక్రమ ఆన్లైన్ లోన్ యాప్లు ఎక్కడ నుండి పని చేస్తున్నాయో గమనించామన్నారు. కాబట్టి, చట్టవిరుద్ధమైన, అనైతికమైన, నేరపూరితమైన ఆన్లైన్ లోన్ యాప్ల నుండి లక్షలాది మంది అమాయకులు, కష్టజీవులని రక్షించడానికి వెంటనే ఈ క్రింది చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర పోలీసులను కోరుతున్నామని దాసోజు శ్రావణ్ తెలిపారు.

-కాంగ్రెస్ నేత సూచించిన కొన్ని చర్యలు
1. పోలీసు శాఖలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసి అన్ని ఆన్లైన్ లోన్ యాప్లను అణిచివేయాలి, అవి పూర్తిగా మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలి
2 ఆన్ లోన్ యాప్ల చట్టవిరుద్ధంగా ప్రవేశించకుండా నిరోధించడానికి బలమైన సైబర్ సెక్యూరిటీ ఫైర్వాల్లను ఏర్పాటు చేయాలి
3 .ఆన్లైన్ లోన్ యాప్లకు సంబంధించిన నేరాలు, ఫిర్యాదులు క్రమం తప్పకుండా పెరుగుతున్నందున ఈ సమస్యను పరిష్కరించడానికి టోల్ ఫ్రీ నంబర్, ప్రత్యేకమైన ఇమెయిల్ ఐడీతో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయాలి.
4. దేశం అంతటా ప్రత్యేకించి బెంగళూరు, హైదరాబాద్, నోయిడా, బీహార్, జార్ఖండ్, నేపాల్ ఇతర ప్రాంతాల నుండి అనేక ఆన్లైన్ యాప్లు పనిచేస్తున్నందున, ఇతర రాష్ట్రాల పోలీసులతో సభ్యులుగా ఒక అంతర్రాష్ట్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి
5. ఎన్బీఎఫ్సీ రిజిస్ట్రేషన్, ఆర్బిఐ ఆమోదం ఉన్న ఆన్లైన్ లోన్ యాప్లు మాత్రమే గూగల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్, ఇతర యాప్ హోస్టింగ్ ప్లాట్ఫారమ్లలో హోస్ట్ చేయబడతాయని నిర్ధారించాలి.
6. ప్రభుత్వ , ప్రైవేట్ రంగ బ్యాంకులు చిన్న, మధ్యతరహా సూక్ష్మ పరిశ్రమలు, మధ్యతరగతి జీతాలపై బ్రతికేవారు, రోడ్డు పక్కన వ్యాపారులు, వ్యాపారులు, వీధి వ్యాపారులు , కొత్త వ్యాపారవేత్తలు , తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన నిరుపేదలకు తప్పనిసరిగా రుణాలు ఇచ్చేలా పాలసీని తీసుకురావాలి. అనైతికమైన ఆన్లైన్ లోన్ యాప్లు దుర్మార్గాల నుండి సామాన్యప్రజలని కాపాడాలి.
సమర్థవంతమైన బ్యాంకింగ్ వ్యవస్థ లేనప్పుడు, ప్రజలు మళ్లీ దయలేని ఆన్లైన్ లోన్ యాప్లు , ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల ఆశ్రయిస్తారు. వీరు సామాన్యుల అవసరాన్ని ఆసరా తీసుకొని వారి జీవితాలతో చెలగాటం ఆడుతారు. కాబట్టి ఈ విషయంలో మీ తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాను.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular