https://oktelugu.com/

Kaleswaram Is Closing: కాళేశ్వరం మూసివేత తప్పదా?.. ఈ పరిస్థితి ఎందుకు?

లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరందిస్తున్నాని చెబుతున్న సీఎం కేసీఆర్ కేవలం ఒక పార్శ్వం మాత్రమే తెలంగాణ ప్రజలకు చూపిస్తున్నారు. మరో పార్శ్వంలో ఈ ప్రాజెక్టు కట్టడం వెనుక అసలు కథ దాగి ఉంది. ఈ ప్రాజెక్టు నిజంగా తెలంగాణ ప్రజలకు ఉపయోగమా? లాభదాయకమా? నష్టమా? అన్నది తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసి కేసీఆర్ తీరుకు విసిగివేసారి రాజీనామా చేసిన ఓ కలెక్టర్ వివరించారు. ఈయనను ఇప్పుడు జగన్ ఏపీలో విద్యా, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : May 30, 2022 / 03:53 PM IST
    Follow us on

    లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరందిస్తున్నాని చెబుతున్న సీఎం కేసీఆర్ కేవలం ఒక పార్శ్వం మాత్రమే తెలంగాణ ప్రజలకు చూపిస్తున్నారు. మరో పార్శ్వంలో ఈ ప్రాజెక్టు కట్టడం వెనుక అసలు కథ దాగి ఉంది. ఈ ప్రాజెక్టు నిజంగా తెలంగాణ ప్రజలకు ఉపయోగమా? లాభదాయకమా? నష్టమా? అన్నది తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసి కేసీఆర్ తీరుకు విసిగివేసారి రాజీనామా చేసిన ఓ కలెక్టర్ వివరించారు. ఈయనను ఇప్పుడు జగన్ ఏపీలో విద్యా, గ్రామీణాభివృద్ధి కోసం సలహాదారుగా పెట్టుకున్నారు. అక్కడ అద్భుతాలు చేస్తున్న ఈ కలెక్టర్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కాళేశ్వరంపై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు షాకిచ్చేలా ఉన్నాయి.

    Kaleswaram

    రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళి కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంలా మారిందని, మేఘా క్రిష్ణారెడ్డిని దేశంలోనే ధనవంతుడిని చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు కాళేశ్వరంతోనే తెలంగాణలో ప్రతీ ఎకరాకు సాగునీరందుతోందని అధికార టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పుకుంటున్నారు. ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు తెలంగాణ మంత్రులు. ఇలాంటి పరిస్థితిలో రిటైర్డ ఐఏఎస్‌ ఆకునూరి మురళి కాళేశ్వరం మూసివేయక తప్పదంటూ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా సంచలనమయ్యాయి.

    Akunuri Murali

    -ఎకరా సాగునీటికి రూ.50 వేల కరెంటు బిల్లు..

    సీఎం కేసీఆర్‌ అన్నీ తానై నిర్మించిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరాకు సాగునీరు అందించాలంటే కరెంటు ఖర్చే రూ.50 వేలు అవుతుందని, తెల్ల ఏనుగు లాంటి ప్రాజెక్టును మూసివేయక తప్పదని స్వయంగా ఇంజినీర్‌ అయిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ మురళి ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే ప్రోగ్రాంలో స్పష్టం చేశారు.

    -దేశంలోనే మొట్టమొదటి ఇంజనీర్‌ కన్ఫర్డ్‌ ఐఏఎస్‌..

    సాధారణంగా రెవెన్యూ విభాగంలో పనిచేసినవారు ఐఏఎస్‌లుగా కన్ఫర్డ్‌ అవుతుంటారు. అయితే కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆకునూరి మురళి మాత్రం చిన్న వయసులోనే గ్రూప్‌–1 కొలువు సాధించి, ఆర్‌ అండ్‌ బీలో ఇంజినీర్‌గా ప్రస్తానం కొనసాగించి ఐఏఎస్‌ అయ్యారు. దేశంలోనే మొట్టమొదటి ఇంజనీర్‌ కన్ఫర్డ్‌ ఐఏఎస్‌గా గుర్తింపు పొందారు. గ్రామీణ పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో నిష్ణాతుడిగానూ పేరు పొందారు. ఎన్నెన్నో అంతర్జాతీయ సంస్థలకు సైతం సేవలందించిన మురళి తెలంగాణ ఏర్పాటు తర్వాత జిల్లా కలెక్టర్‌ గానూ పనిచేశారు. అయితే తర్వాతి కాలంలో ప్రాధాన్యం లేని పోస్టుల్లో వేశారని, పని చేసే అవకాశం ఇవ్వాలని కోరినా సీఎం కేసీఆర్‌ నో చెప్పారని, అందుకే వ్యక్తిగత స్థాయిలోనైనా సమాజానికి సేవ చేద్దామనే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.

    -కేసీఆర్‌ వద్దనుకుంటే జగన్‌ సలహాదారుగా నియమించుకున్నారు..

    తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరన్‌రావు వద్దనుకున్న ఆకునూరి మురళిని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సలహాదారుగా నియమించుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఏపీలో విద్యా, గ్రామీణాభివృద్ధిరంగాల్లో సంచలనల మార్పులు చోటుచేసుకోవడం తదుపరి చరిత్ర. కాగా, తెలంగాణలో విద్యావిధానం, కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులపై ఇంజనీర్‌ కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన కీలక రంగాలపై మురళి తన ఆలోచనలు పంచుకున్నారు.

    – తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం జాతీయ హోదా, నిధులు ఇవ్వకున్నా, కేసీఆర్‌ సర్కారు సొంతంగా అప్పులు చేసిమరీ దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం, దాని ద్వారా సుమారు 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పడం తెలిసిందే. అయితే ‘అసలు కాళేశ్వరం దొంగ స్కీం అని, కమీషన్ల కోసం రూపొందిన ప్రాజెక్టు’ అని రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళి ఆరోపించారు. ‘ప్రపంచంలోనే మూర్ఖపు ప్రాజెక్టుగా, తెల్ల ఏనుగులా మారిన కాళేశ్వరాన్ని నిర్వహించలేమని, ఐదేళ్లలోపే దాన్ని మూసేయక తప్పదు’ అని తెలిపారు.

    – ‘నేను భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా పనిచేశా. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ డిజైన్‌ చేసినప్పుడు సీఎం 36 లక్షల ఎకరాల ఆయకట్టు అని చెప్పారు. ప్రారంభించినప్పుడు 42 లక్షల ఎకరాలు అన్నారు. ఆ ప్రాజెక్టు నీరు ఎన్ని ఎకరాల్లో పారుతుందని నేను ఆర్టీఐ పెడతాను. 15 లక్షల ఎకరాలు పారుతుందని నిరూపిస్తే.. దేనికైనా సిద్ధం. ప్రపంచంలోనే ఇంత మూర్ఖపు ప్రాజెక్టు లేదు. ఎకరా వరికి నీరు పారించాలంటే దీనికయ్యే కరెంటు ఖర్చు రూ.50 వేలు. ఈ విషయాన్ని ప్రభుత్వ నీటి పారుదల శాఖ సలహాదారు శ్రీధర్‌రావు దేశ్‌పాండేనే ఒక వ్యాసంలో రాశారు. కేసీఆర్‌ తానే ఇంజనీర్‌గా, విధాన రూపకర్తగా వ్యవహరించారు. కాబట్టే కాళేశ్వరానికి దుస్థితి తలెత్తింది. ఒకే దెబ్బతో ఇంకో మూడు, నాలుగు ఎన్నికలకు సరిపడా పెట్టుబడి డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆలోచన తనది. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికీ తెల్ల ఏనుగు. ఇంకో ఐదేళ్లలో దాన్ని మూసేయాల్సి వస్తుంది’ అని అన్నారు.

    – ‘కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి మోసపూరిత పథకాలే దళితబంధు, రైతుబంధు అని, కేవలం ఎస్సీల ఓట్లు పొందేందాలనే దుర్మార్గపు ఆలోచన తప్ప దళిత ఉన్నతికి బంధు ఏమాత్రం పనికిరాదని, ఫామ్‌ హౌస్‌లున్న సినిమా సెలబ్రిటీలు, సివిల్స్‌ ఇతర ఉన్నతాధికారులకూ రైతుబంధు డబ్బులు పడుతున్నాయంటేనే అదెంత వృథా స్కీమో అర్థం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు.

    – నియోజకవర్గానికి 100 మందికి చొప్పున దళిత బంధు అమలు చేస్తూ పోతే, రాష్ట్రంలోని 18 లక్షల దళిత కుటుంబాలకు బంధు చేరడానికి 156 ఏళ్ల సమయం పడుతుంది’ కానీ కేసీఆర్‌ కేవలం ఓట్ల కోసమే దీనిని ప్రవేశపెట్టారు అని తెలిపారు.

    – తెలంగాణలో విద్యా వ్యవస్థను కేసీఆర్‌ సర్కారు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తున్నదని రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళి ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం రూ.12వేల కోట్లు టీచర్ల జీతాలు ఇస్తున్నారని, స్కూల్‌ స్థాయిలో ఒక విద్యార్థి మీద ఏడాదికి రూ.40–45 వేలు ఖర్చు పెడుతున్నారని, అదే ప్రైవేటు స్కూళ్లలో రూ.7 వేలు ఖర్చు పెడుతున్నారని, మరి ప్రైవేటులో 90 శాతం ఏ గ్రేడ్‌ తీసుకొస్తే.. సర్కారు పాఠశాలల్లో 63 శాతం సీ గ్రేడ్‌ ఉంటున్నారని, దీనికి కారణం సీఎంకు, సర్కారుకు విజన్‌ లేకపోవడమేనని, పాఠశాల విద్య మీద గానీ, యూనివర్సిటీ విద్య మీద గానీ, నాణ్యమైన విద్య విషయంలోగానీ సీఎం కేసీఆర్‌ కనీసం ఐదు నిమిషాలైనా సమీక్ష నిర్వహించలేదని మురళి విమర్శించారు.

    Also Read: Famous Singer Demise On Stage: షాకింగ్ : పాట పాడుతూ స్టేజ్‌పైనే మరణించిన ప్రముఖ సింగర్ !

    – ‘పేదలకు కావాల్సింది విద్య, వైద్యం. వీటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టట్లేదు. తెలంగాణ రాక ముందు విద్యకు 11 శాతం బడ్జెట్‌ ఉండేది. అది ఇప్పుడు 6.2 శాతానికి వచ్చింది. కేంద్రంలో కూడా గతంలో 6 శాతం ఉంటే.. దానిని 2.6 శాతం చేశారు. ధనిక దేశమైన అమెరికాలో 93 శాతం ప్రభుత్వ, 7 శాతం ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. మరి మన పేద దేశంలో ఎలా ఉండాలి. సరిగ్గా ప్రణాళిక ఉంటే.. ఐదేళ్లలో రాష్ట్రంలో అద్భుతమైన స్కూళ్లు కట్టొచ్చు. ప్రతీ నియోజకవర్గంలో అపోలో, యశోద, కేర్‌ వంటి ఆస్పత్రులు నిర్మించొచ్చు..’ అని ఆకునూరి మురళి అన్నారు.

    -కిక్కురుమనని గులాబీ మంత్రులు, నేతలు..

    ప్రతిపక్ష పార్టీలు సీఎం కేసీఆర్‌ అవినీతిపై ఆరోపణలు చేస్తే వెంటనే ప్రెస్‌మీట్లకు క్యూకట్టే టీఆర్‌ఎస్‌ నేతలు ఆకునూరి మురళి ఇంటర్వ్యూ ప్రసారమైన 24 గంటలు గడిచినా కిక్కురు మనడం లేదు. ప్రధాన మంత్రి నుంచి రాష్ట్రస్థాయి నాయకుడు వరకూ కాళేశ్వరంపై ఆరోపణలు చేస్తే ఇష్టానుసారం దుర్భాషలాడుతూ మాట్లాడే కొంతమంది నాయకులు కూడా ఇప్పుడు మురళీ వ్యాఖ్యలతో డిఫెన్స్ లో పడిపోయారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ చేసిన వ్యాఖ్యల్లో ఎంతో కొంత నిజం ఉందన్న అభిప్రాయం ఆ నేతల్లో వ్యక్తమవుతోంది.

    మరోవైపు మురళి చెప్పినట్లు కాళేశ్వరం కరెంటు బిల్లు ప్రభుత్వానికి గుదిబండగా మారుతోంది. విద్యుత్‌ సంస్థకు బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందని గులాబీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.

    ప్రభుత్వంలో పనిచేసి.. కాళేశ్వరం కట్టేటప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ మురళీ వ్యాఖ్యల్లో చాలా వరకూ నిజం ఉందని మేధావులు అంటున్నారు. కాళేశ్వరం నుంచి నీరు వస్తున్నా ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి ప్రబుత్వానికి రూ.50వేల వరకూ ఖర్చు అవుతోంది. అదే సమయంలో రైతు పెట్టుబడి 25 వేలు దాటడం లేదు. మరిఈ ప్రాజెక్టు ఉత్తమమైనదా? కాదా? అన్నది ఇక్కడే తేలుతోంది.

    Also Read: BJP And TRS Competing For Power: అధికారమే లక్ష్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీయేనా?

    Recommended Videos:


    Tags