Delhi Incident: దేశ రాజధానిలో సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన కారు పేలుడు సంచలనం సృష్టించింది. ఈ ఘటన కు సంబంధించి ఇప్పుడు కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఇదంతా కూడా ఫరీదాబాద్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న డాక్టర్ మహమ్మద్ ఉమర్ పని అయి ఉంటుందని మంగళవారం మధ్యాహ్నం దాకా నిఘా వర్గాలు అనుమానించాయి. అయితే ఇప్పుడు అది అనుమానం కాదని, నిజమని తేలింది. ఈ దాడి ఆత్మహుతి తరహాలోని ఉగ్రదాడి అని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఉగ్రదాడి ఫరీదాబాద్ మాడ్యూల్ అని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫరీదాబాద్ మాడ్యూల్ లో ప్రధాన నిందితుడిగా ఉమర్ వ్యవహరించాడని.. అతడి సహచరుడు షకీల్ అరెస్టు అయ్యాడని.. అందువల్లే గుమ ఆందోళనకు గురయ్యాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసులకు పట్టుపడితే ఆ తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. అందువల్లే అతడు ఆత్మహుతికి పాల్పడి ఉండవచ్చని తెలుస్తోంది. ఇంటలిజెన్స్ వర్గాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.. పేలుడు పదార్థాలు భారీగా నింపి.. కారులో కూర్చుని ఉద్దేశపూర్వకంగానే ఉమర్ తనను తాను పేల్చివేసుకుని ఉంటాడని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో 9 చనిపోయారు. చాలామంది గాయపడ్డారు.. ఈ ఘటన జరిగినప్పుడు ఉమర్ కారులోనే ఉన్నట్టు సీసీ కెమెరా రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఈ ఘటన కంటే కొన్ని గంటల ముందు ఉమర్ కారులో కూర్చున్న దృశ్యాలను పోలీసులు గుర్తించారు.. పోలీసులు షకీల్ ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. తనని కూడా అదుపులోకి తీసుకుంటారని ఉమర్ భయపడి ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని తెలుస్తోంది.
ఈ పేలుడు వల్ల కారు పూర్తిగా కాలిపోయింది. అదే సమయంలో ఉమర్ మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కనిపించింది. అయితే అది అతడిదేనా? మరొక వ్యక్తి దా? అని నిర్ధారించుకోవడానికి డిఎన్ఏ పరీక్ష చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఉమర్ కొద్దిరోజులుగా పరారీలో ఉంటున్నాడు. ఉత్తర భారత దేశంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. అనేక ప్రాంతాలలో టెర్రర్ ఫైనాన్స్, ఆయుధాల అక్రమ రవాణా కేసులలో అతడు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. అతని కోసం చాలా రోజులుగా పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.