
ప్రపంచ జనాభా పెరిగే కొద్దీ అవసరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తాగునీరు కొరత రాను రాను తీవ్రమవుతోంది. ఆధునిక పోకడలతో అడువులు నరికివేయడం వల్ల వర్షాభావం ఏర్పడి కరువుతో అల్లాడుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రకృతిలో దొరికే నీటిని కూడా వ్యాపారం చేయాల్సి వస్తోంది. అయితే స్వచ్ఛమైన తాగునీరు తీసుకోవాలనే ఉద్దేశంతో కొందరు ప్లాస్టిక్ బాటిళ్లలో నీటి కోసం తాపత్రయపడుతున్నారు. పూర్వకాలంలో ప్రయాణం చేసేటప్పుడు నీటిని కచ్చితంగా తీసుకెళ్లేవాళ్లు. కానీ నేడు దుకాణాల్లో, షాపుల్లో ప్లాస్టిక్ బాటిళ్ల నీటిని కొంటున్నారు. అయితే ఆ ప్లాస్టిక్ బాటిళ్ల నీరు సురక్షితమేనా..? ఆ నీటిలో ఏముంటుంది..?
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ బాటిళ్ల నీటి వాడకం పెరిగిపోయింది. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం సురక్షితం కాదని గ్రహించిన పర్యావరణ శాస్త్రవేత్తలు ఆ నీటిపై పరిశోధన చేశారు. న్యూయార్క్ లోని స్టేట్ ల్యాబ్లో భారత్ సహా 9 దేశాల నుంచి సేకరించిన ప్లాస్టిక్ బాటిళ్ల నీటిని పరిశోధించారు. ఈ నీటిలో ఏముందో తెలుసుకోవడానికి వాటికి ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని కలిపారు. అయితే ఆ తరువాత శాస్త్రవేత్తలకు షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. ప్లాస్టిక్ బాటిళ్ల నీటిలో మైక్రాన్ల కంటే పెద్ద రేణువులు కనిపించాయి.
ఒక లీటరు బాటిల్ నీటిలో 100 మైక్రాన్ల కంటే పెద్ద రేణువులు 10 ఉన్నట్లు గుర్తించారు. ఇవి ఒక మనిషి వెంట్రుక కంటే పెద్దగా ఉన్నాయి. అంటే ఇదే లీటర్ బాటిల్ లో చిన్న చిన్న రేణువులు 314 వరకు ఉన్నాయి. అయితే ఇవి ప్లాస్టిక్ రేణువులా..? ఇంకేమైనా పదార్థాలా..? అని శాస్త్రవేత్తలు నిర్ధారించలేదు. కానీ ఆ నీటిలో కొత్తవి మాత్రం ఉన్నట్లు తెలుసుకున్నారు. మైక్రోప్లాస్టిక్ ను అదుపు చేయడానికి ఎలాంటి చట్టాలు, నిబంధనలు లేకపోయినా ఇవి నీళ్లలో ఉంటే ప్రమాదమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అయితే వాటర్ బాటిల్ ఉత్పత్తి సంస్థలు మాత్రం ఈ పరిశోధనను వ్యతిరేకిస్తున్నాయి. ఇవి అస్పష్టమైన ఆధారాలంటున్నాయి. ఏవియాన్ అనే సంస్థ ఈ పరిశోధనలపై స్పందించింది. అత్యుత్తమ నాణ్యమైన పదార్థాలు ఉత్పత్తి చేసినప్పుడు ఇటువంటివి సహజంగానే కనిపిస్తాయని అంటోంది. ఈ వాదనకు డసాని మినరల్ వాటర్ సంస్థ కూడా సపోర్టు చేసింది.
మనం తీసుకునే ఆహారంలో ఎంతో కొంత ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తుంది. అయితే ఇది హానికరం అని అనలేం అని బ్రిటన్ ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ అంటోంది. అయితే ఇప్పుడున్న పరిశోధనలను మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అంటోంది. అయితే సాధ్యమైనంత వరకు మంచినీళ్ల బాటిల్ వాడేటప్పుడు నాణ్యమైనది సరిచూసుకోవాలని అంటున్నారు. పరిశుద్ధమైన తాగునీరు అందుబాటులో లేనప్పుడు మినరల్ వాటర్ వాడడం మంచిదే అని అంటున్నారు. ఎందుకంటే కలుషిత నీటి కంటే మినరల్ వాటిల్ బాటిల్ పెద్ద ప్రమాదం చేయలేదని వివరిస్తున్నారు.
భారత్ కు చెందిన అక్వాపినీ, బిస్లెరీ సంస్థల బాటిళ్లను ఢిల్లీ, ముంబై, చెన్నైల నుంచి సేకరిపంచి పరిశోధనలు చేశారు. వీటిలోనూ పైన తెలిపిన ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు గుర్తించారు. అయితే సదరు సంస్థలు మాత్రం ఈ పరిశోధనలపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ ప్లాస్లిక్ బాటిల్ లో ఉండే రేణువులు మంచివా..? కాదా..? అనేవి మాత్రం ఇంకా నిర్దారించలేదంటున్నారు పరిశోధకులు. ప్రకృతిపరంగా లభించే స్వచ్ఛనీరు లభించినప్పుడు బాటిల్ నీరు అవాయడ్ చేసినా.. అత్యవసర సమయంలో మాత్రం మినరల్ వాటర్ వాడొచ్చని అంటున్నారు. అయితే ఇళ్లల్లోనూ మినరల్ వాటర్ వాడడం వల్ల మనకు తెలియకుండానే అనారోగ్యాన్ని తెచ్చుకునే అవకాశం ఉందని కొందరు వైద్య నిపుణులు తెలుపుతున్నారు.