Pawan Kalyan Yuvashakti: దిక్కులు పిక్కటిల్లేలా గర్జించేందుకు జన సైనికులు సిద్ధమయ్యారు. ఉత్తరాంధ్ర యువత వాణిని వినిపించేందుకు యువశక్తి వేదిక సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలస సమీపంలో గురువారం జనసేన యువశక్తి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సుమారు 25 ఎకరాల ప్రాంగణంలో సభా వేదిక ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు ఒక కొలిక్కి వచ్చాయి. గత కొద్దిరోజులుగా జన సైనికులు అహోరాత్రులు శ్రమించి ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ పర్యవేక్షిస్తున్నారు. కొద్దిరోజులుగా ఆయన శ్రీకాకుళం జిల్లాలో మకాం వేశారు. అటు కార్యక్రమ ఏర్పాట్లతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల శ్రేణులతో సమావేశమై జన సమీకరణ చేస్తున్నారు. సభకు దాదాపు 3 లక్షల మంది యువత వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.

దాదాపు 10 అడుగుల ఎత్తులో సభా వేదికను ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు 100 మంది ప్రతినిధులు వేదికపై కూర్చునేలా డయాస్ రూపొందించారు. ముందు వరుసలో నాయకులు కూర్చునేందుకు, తరువాత వరుసలో మహిళలు, అటు తరువాత యువత కూర్చునే వీలుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో తాగునీరు వసతి కల్పిస్తున్నారు. ఒక్క ఉత్తరాంధ్ర కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా యువత వచ్చే అవకాశముండడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆహ్వాన, ఆహార, రవాణా, భద్రత..ఇలా అన్నిరకాల కమిటీలు ఏర్పాటుచేశారు. ఆ బాధ్యతలను కీలక నాయకులకు అప్పగించారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి జనసేన నాయకులు అక్కడకు చేరుకుంటున్నారు.
శ్రీకాకుళం నగరంతో పాటు రణస్థలానికి జనశ్రేణుల తాకిడి పెరిగింది. దాదాపు అన్ని లాడ్జిలు, హోటళ్లు జన సైనికులతో నిండిపోయాయి. సభా ప్రాంగణం శ్రీకాకుళం నగరానికి దగ్గరగా ఉంటుంది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి చేరుకున్న యువత, నాయకులు శ్రీకాకుళం నగరానికి చేరుకుంటున్నారు. గురువారం ఉదయం నేరుగా సభా ప్రాంగణానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇప్పటికే తాళ్లవలస సమీపంలోని సభా ప్రాంగణం వెలుపుల భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. పవన్ కళ్యాణ్ నిలువెత్తు కటౌట్లతో జన సైనికులు నింపేశారు. దాదాపు జాతీయ రహదారికిరువైపులా ఎక్కడా ఖాళీ లేకుండా ఫ్లెక్సీలు కట్టారు. గత కొద్దిరోజులుగా సభా ప్రాంగణం విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది.

జాతీయ రహదారి చెంతనే తాళ్లవలసలో 25 ఎకరాల సువిశాలమైన లేఅవుట్ లో యువశక్తి సభా వేదికను ఏర్పాటు చేశారు. అటు విశాఖకు సరిగ్గా 65 కిలోమీటర్ల దూరంలో ప్రాంగణం ఉంటుంది. నిత్యం బస్సు సౌకర్యం ఉంటుంది. శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. వాటి ద్వారా సభ ప్రాంగణానికి చేరుకోవచ్చు. సుభద్రాపురం జంక్షన్ లో దిగితే..200 మీటర్ల దూరంలో యువశక్తి వేదిక కనిపిస్తోంది. అటు రైలు మార్గంలో రావాల్సిన వారు విజయనగరం కానీ, శ్రీకాకుళం రోడ్డుకు కానీ చేరుకోవచ్చు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన్ని ఆశ్రయించాలి.