Shock for RJD: త్వరలోనే బీహార్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జెడి కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీ తప్పులను ఎక్కడికక్కడ ఎండగడుతున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే తాను ముఖ్యమంత్రి అవుతానని తేజస్వి ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. పైగా తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రిదేవి ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండడం తేజస్వి యాదవ్ కు కలిసి వస్తుందని అక్కడ మీడియా ప్రచారం చేస్తోంది.
ఇన్ని సానుకూల అంశాలు ఉన్న నేపథ్యంలో తేజస్వి యాదవ్ కు ఒక్కసారిగా షాక్ తగిలింది. అతడి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ఐ ఆర్ సి టి సి స్కాం జరిగింది. ఆ స్కాంలో లాలు కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. అదే కాదు విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే స్పష్టం చేశారు. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ వీల్ చైర్ లోనే విచారణకు హాజరయ్యారు.
ఎన్నికల ముందు ఇలా జరగడంతో ఆర్జేడిలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. ప్రచారంలో దూసుకుపోతున్న ఆ పార్టీకి ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి అధికారంలోకి వచ్చి.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని తేజస్వి యాదవ్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆయన ఒకటి అనుకుంటే.. ఢిల్లీ కోర్టు మరొకటి చేసింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు ఒకసారిగా నిర్వేదంలో పడిపోయారు..
ఆర్జెడి నాయకులు ఐఆర్సిటిసి స్కాం విషయంలో మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. రాజకీయంగా తమను దెబ్బ కొట్టడానికి కేంద్రంలో ఉన్న బిజెపి ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని.. దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నదని ఆర్జెడి నేతలు ఆరోపిస్తున్నారు. తేజస్వి యాదవ్ కు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.. మరోవైపు బిజెపి నేతలు ఈ వ్యవహారంపై స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందని.. ఇందులో రాజకీయ కుట్రలకు ఎటువంటి అవకాశం లేదని చెబుతున్నారు. విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేస్తున్నారు. కుంభకోణాలకు పాల్పడిన పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని వారు అంటున్నారు. మరోవైపు ఐఆర్సిటిసి స్కాం విషయంలో ఏవైనా సంచలన నిజాలు కనుక బయటికి వస్తే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఆర్ జె డి కి ఉండదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.