Shiva Lingam : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఉన్న నవనాథ సిద్ధుల గుట్ట ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో ఉన్న సిద్దేశ్వర స్వామి లింగం ప్రత్యేకత ఏమిటంటే, దానిపై ఒక్క సూర్య కిరణం కూడా పడదు. గుహలో వెలసిన ఈ శివలింగం ఉదయం చల్లగా, మధ్యాహ్నం గోరువెచ్చగా మారుతుందని ఆలయ అర్చకులు కుమార్ శర్మ తెలిపారు. చాలా శతాబ్దాల క్రితం గోరఖ్‌నాథ్, జలంధర్‌నాథ్, చరపట్‌నాథ్, అపభంగనాథ్, కాన్షీనాథ్, మశ్చీంద్రనాథ్, చౌరంగీనాథ్, రేవనాథ్, భర్తరీనాథ్ అనే నవనాథులు దేశవ్యాప్తంగా సంచారం చేస్తూ ఇక్కడ తపస్సు చేశారు. ఈ పవిత్ర స్థలం వారి సాధన స్థలంగా మారిందని చరిత్ర చెబుతోంది.
గుహలోని శివలింగం ప్రత్యేకత ఏంటంటే ఒక్క సూర్య కిరణం కూడా లింగంపై పడదు. లింగ స్వరూపం కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఆలయం సాధారణ భక్తులకు దర్శనానికి అనుకూలమైనది కాదు. ఇది తపస్సు చేసే ఋషులు, అఘోరాలు మాత్రమే ఎక్కువగా సందర్శిస్తుంటారు. శివలింగం దర్శనానికి బండల మధ్య పాకుతూ, సొరంగ మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది.
ఆలయ మహిమ, చరిత్ర
నవనాథులు కొలువుదీరిన ఈ పవిత్ర స్థలం వందల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. కాకతీయుల పరిపాలన సమయంలో ఆలయం వెలుగులోకి వచ్చింది. 1951లో రామాలయం నిర్మాణం జరిగి, అయోధ్యలో ఉన్నట్లే ఇక్కడ కూడా ఉత్సవ విగ్రహాలు ప్రతిష్టించారు.శివరాత్రి, శ్రీరామనవమి, కార్తీక పౌర్ణమి, ఉగాది వంటి పండుగలను ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుతారు.
ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక కేంద్రం
నవనాథ సిద్ధుల గుట్ట ప్రకృతి అందాలతో కూడిన విశేషమైన ప్రదేశం. జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడకు వస్తుంటారు. గుట్టపై బండరాళ్లు ఒకదానిపై మరొకటి పేర్చినట్లు ఉండి ప్రకృతి అద్భుతంగా కనిపిస్తుంది. సిద్దేశ్వర స్వామి దర్శనం వల్ల మనసు ఉల్లాసంగా, ఆనందంగా నిండిపోతుంది. శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇది అత్యంత ముఖ్యమైన స్థలంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాచీనమైన సిద్దేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మికత, పవిత్రత కలిగిన ఆలయంగా భక్తుల విశ్వాసాన్ని చూరగొంటోంది.