Government Bank : పది పాసై ఇంటి దగ్గర ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నారా. ఉద్యోగం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారా. అలాంటి వారికో గుడ్ న్యూస్. ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రామీణ నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశం లభించబోతోంది. ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నవారు, ఉపాధి కోసం ఎదురుచూస్తున్నవారికి కెనరా బ్యాంక్ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. కర్నూలు జిల్లా కల్లూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు.
ఉచిత శిక్షణలో ఏమేం ఉంటాయి?
గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను అందించేందుకు ఉచితంగా వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కెనరా బ్యాంక్ కల్లూరు బ్రాంచ్ మేనేజర్ కె. పుష్పక్ కుమార్ వెల్లడించారు. ఈ శిక్షణ శిబిరంలో మహిళలకు కుట్టుమిషన్, మగ్గం వర్క్, కంప్యూటర్ డేటా ఎంట్రీ వంటి కోర్సులు అందిస్తారు. అదే విధంగా, పురుషులకు మొబైల్ రిపేర్, బైక్ మెకానిక్, సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్, సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ తదితర శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అంతేకాకుండా, లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ శిక్షణను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఇది మొదటిసారి అమలు చేయబోతున్న ప్రోగ్రామ్.
శిక్షణ శిబిరం ప్రత్యేకతలు
ఈ శిక్షణ శిబిరంలో అభ్యర్థులకు ఉచితంగా వసతి, భోజన సదుపాయం అందజేస్తారు. డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి గుర్తింపు సర్టిఫికెట్, సంపూర్ణ ఉచిత శిక్షణ, నైపుణ్యాలను మెరుగుపరచుకుని ఉపాధి అవకాశాలను పొందే అవకాశం కల్పిస్తారు.
ఎవరెవరు అర్హులు?
18 నుండి 45 ఏళ్ల లోపు వారు ఈ శిక్షణకు అర్హులు. తెలుగులో చదవడం రాయడం వచ్చి ఉండాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులు అయి ఉండాలి.
ఎప్పుడు ప్రారంభం?
ఈ నెల 24వ తేదీ నుంచి ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. కెనరా బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చేసుకునేందుకు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్, విద్యార్హత పత్రాల జిరాక్స్ అవసరం అవుతాయి. మరిన్ని వివరాల కోసం 6304491236, 8500677585 సంప్రదించాలి.