తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటోంది. ఇప్పటికే పలు పార్టీలు తెలంగాణలో తమ ప్రభావాన్ని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే తాజాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో ఓటర్ల ముందుకు రానున్నారు. వైఎస్ జయంతి జులై 8న పార్టీ ఆవిర్భావానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో రాష్ర్టంలో చతుర్ముఖ పోటీ జరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్ టీపీ లతో కలిసి తెలంగాణలో రాజకీయం నడుస్తోందని చెబుతున్నారు. అయితే షర్మిల ఏ మేరకుతన ప్రభావాన్ని చూపుతారో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగానే గుర్తింపు తప్ప ఆమెకు అదనపు అర్హతలు ఏమీ లేవు. పార్టీ జెండా కూడా ఖరారయిపోయాయి. తెలంగాణ రాష్ర్ట పక్షి పాలపిట్ట రంగుతో రూపొందించారు.
జెండాలో 80 శాతం పాలపిట్ట రంగుతో మిగిలిన 20 శాతం నీలిరంగు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. జెండా మధ్యలో తెలంగాణ భౌతిక స్వరూపం అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రం ఉండేలా రూపకల్పన చేశారు. వివరాలు పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ తెలిపారు. జులై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున హైదరాబాద్ ఫిలింనగర్ లోని జేఆర్సీ సెంటర్ లో నిర్వహించనున్నారు.
ఇప్పటికే షర్మిల సైతం వ్యూహకర్తను నియమించుకుని తన పార్టీ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ టీంలో కీలకంగా వ్యవహరించే ప్రియను తన వ్యూహకర్తగా ఎంచుకున్నట్లు సమాచారం. డీఎంకే ఎమ్మెల్యే కూతురు ప్రియ తాజాగా లోటస్ పాండ్ లో షర్మిలను ప్రియ కలిసినట్లు తెలిసింది.
షర్మిల ఇప్పటికే తెలంగాణలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు పాత్ర పోషిస్తున్నారు. నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాడుతున్నారు. వారి జీవితాల్లో వెలుగుుల నిండేలా చూస్తానని హామీ ఇస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ప్రభావం చూపించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న షర్మిల ఎవరిని వదలకుండా తనదైన శైలిలో విమర్శిస్తూ ముందుకు వెళుతున్నారు. ఇక మీదట ఎలాంటి ప్రణాళికతో ప్రజల్లోకి వెళతారో వేచి చూడాల్సిందే.