వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ ఎవరని ప్రశ్నించడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ మంత్రిని ఎవరని ప్రశ్ణించడం ఆమె అహంకారానికి నిదర్శనమని చెబుతున్నారు. టీఆర్ఎస్ సానుభూతిపరులు షర్మిల మాటలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ ఎవరంటూ షర్మిల అడగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ ను అవమానించేందుకు షర్మిల అలా చేశారని పేర్కొంటున్నారు.
గత ఎన్నికలకు ముందు షర్మిల కేటీఆర్ సాయంతో తనపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై పెట్టిన కేసులు గుర్తుకు లేవా అని ప్రశ్ణిస్తున్నారు. కేటీఆర్ కు లోకేష్ కు పోలికలు లేవని చెప్పిన ఆమె ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏమిటని నిర్ఘాంతపోయారు. ఓ సినిమా హీరోతో సంబంధాలున్నాయని జరిగిన ప్రచారాలపై కేటీఆర్ కు ఫిర్యాదు చేసిన విషయం మరిచిపోయారా అని పేర్కొన్నారు. ఏరు దాటేదాక ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడ మల్లయ్య అన్న చందంగా షర్మిల వైఖరి ఉందని చెబుతున్నారు.
అన్ని ప్రయోజనాలు పొందిన షర్మిల ఇఫ్పుడు కేటీఆర్ ఎవరని అనడం నాటకాలాడడమేనని మండిపడుతున్నారు. తెలంగాణ వారిని తక్కువ చేసి మాట్లాడడంతో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. షర్మిల చేస్తున్న రాజకీయ చర్యలపై ఇప్పటికే ప్రజల్లో ఆందోళన పెరిగిపోతోంది. తెలంగాణలో పార్టీ పెట్టి ఇక్కడి వారిపై పెత్తనం చెలాయించాలని చూస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోసారి కేటీఆర్ పై నోరు జారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
షర్మిల తెలంగాణలో పార్టీని నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా అనవసర ప్రేలాపణలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని సూచిస్తున్నారు. పార్టీ తెలంగాణలో నిలబడాలంటే ఇక్కడి సమస్యలపై పోరాడితే చాలని అంటున్నారు. అంతేకాని నాయకుల వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు.