Jagan Vs Sharmila: కన్ఫమ్.. జగన్ పై పోటీకి దిగుతున్న షర్మిల

తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని షర్మిల స్థాపించారు. రాజన్న రాజ్యం తెస్తానంటూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. కానీ రాజకీయంగా ఏది కలిసి రాలేదు. గతంలో సమైక్యవాదాన్ని వినిపించిన షర్మిల.. సడన్ గా తెలంగాణ వాదం వినిపించడంతో అక్కడి ప్రజలు నమ్మలేదు.

Written By: Dharma, Updated On : December 28, 2023 9:06 am

Jagan Vs Sharmila

Follow us on

Jagan Vs Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైయస్ షర్మిల నియామకం దాదాపు ఖరారైనట్లు సమాచారం. తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ముహూర్తం సైతం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని కుదిరితే జనవరి 1న ఈ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తీవ్ర తర్జనభర్జనల నడుమ బాధ్యతలు తీసుకునేందుకు ఆమె సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే షర్మిల, అనిల్ కుమార్ దంపతులు ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని షర్మిల స్థాపించారు. రాజన్న రాజ్యం తెస్తానంటూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. కానీ రాజకీయంగా ఏది కలిసి రాలేదు. గతంలో సమైక్యవాదాన్ని వినిపించిన షర్మిల.. సడన్ గా తెలంగాణ వాదం వినిపించడంతో అక్కడి ప్రజలు నమ్మలేదు. రాజకీయ నిర్ణయాలు కూడా సరిగా లేకపోవడంతో ఆమె వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. తొలుత పార్టీని విలీనం చేస్తారని.. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ నాయకత్వం ఎందుకో పట్టించుకోలేదు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో వరుస విజయాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ దృష్టి ఏపీపై పడింది. అందుకే ఆమెను ఏపీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రం నుంచి కీలక నేతలతో పాటు ఏఐసీసీ నేతలు కూడా భారీగా పాల్గొన్నారు. ఏపీలో పార్టీస్థితిగతులపై చర్చించారు. రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో రాహుల్ ఏపీ నాయకత్వం పై మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంపై నేతల అభిప్రాయాలను కోరారు. అయితే మెజారిటీ ఏపీ నేతలు ఆమె బాధ్యతలు చేపడితే పార్టీ బలోపేతం అవుతుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జగన్ లా ధిక్కారస్వరం రాకుండా తాను చూసుకుంటానని రాహుల్ గాంధీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరుతామని ముందుకు వచ్చే నాయకులను అడ్డుకోవద్దని.. మధ్యప్రదేశ్ లో ఇలా చేసే ఓటమి ఎదురైందని రాహుల్ వరించినట్లు తెలుస్తోంది. షర్మిల విషయంలో నిర్ణయం జరిగిపోయిందని.. అందరూ ఆమోదముద్ర వేయాలని రాహుల్ కోరినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో షర్మిల దంపతులు ఢిల్లీ బాట పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముందుగా పార్టీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తారని.. తరువాత అధ్యక్ష బాధ్యతలను షర్మిల తీసుకుంటారని టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల అనంతరం షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిందని… ఏఐసీసీలో సైతం తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాతనే షర్మిల ఏపీ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు వచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే ఏపీలో షర్మిల ఎంటర్ కావడం ఖాయం. అదే జరిగితే తనకు నష్టం జరుగుతుందని వైసిపి కలవర పడుతోంది. అందుకే షర్మిల కాంగ్రెస్ లో ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా పెద్దగా వర్కౌట్ కాలేదు.