
Y. S. Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ .షర్మిలను పోలీసులపై సోమవారం చేయి చేసుకున్నారు. నిరుద్యోగుల సమస్యపై హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద దీక్ష చేయడానికి బయల్దేరిన షర్మిలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాసేపు రోడ్డుపై బైఠాయించారు. అయినా పోలీసులు వెళ్లకపోవడంతో విసిగిపోయిన షర్మిల పోలీసులను తోసుకుంటూ ఇందిరాపార్కుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె మహిళా కానిస్టేబుల్‌తోపాటు ఎస్సైని తోసేశారు.
ఎందుకు అడ్డుకుంటున్నారని..
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో సిట్ దర్యాప్తులో పురోగతి లేకపోవడం, లక్షల మంది నిరుద్యోగుల సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇందిరాపార్కు వద్ద దీక్ష చేయాలని షర్మిల సోమవారం నిర్ణయించారు. ఈమేరకు ఆమె లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. సొంత పనులకు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటారా? తనను హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఏం అధికారం ఉందని షర్మిల పోలీసులను ప్రశ్నించారు.
పోలీసులతో దురుసు ప్రవర్తన..
లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఆమెను ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్న క్రమంలో వారిని తోసేసి మరీ షర్మిల బయటకు వచ్చారు. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకోవడంతోపాటు, తోసేశారు. ఇదేంటని అడిగిన ఎస్సైని కూడా తోసేశారు. మీరు దీక్షకు వెళ్తున్నట్లు తమకు సమాచారం ఉందని, అందుకే బయటకు వెళ్లనివ్వడం లేదని చెప్పినా షర్మిల వినలేదు.

చేయి చేసుకోవడంపై సీరియస్..
ఈ క్రమంలో షర్మిల చేయి చేసుకోవడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంరద్భంగా విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నట్లు 353, 303 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈమేరకు మహిళా కానిస్టేబుల్, ఎస్సైతో ఫిర్యాదు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు షర్మిల అరెస్ట్ విషయం తెలుసుకున్న ఆమె తల్లి విజయమ్మతోపాటు వైఎస్సార్ టీపీ నేతలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బయల్దేరారు. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.