Sharmila: షర్మిల కాంగ్రెస్ లో చేరిక దాదాపు లాంఛనమే. ఆ ఏపీ పగ్గాలు సైతం అందుకుంటారని తెలుస్తోంది. అయితే వీటన్నింటి కంటే ముందుగా.. ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కడప ఎంపీ సీటు విషయంలోనే వైయస్ కుటుంబంలో చిచ్చురేగిందని.. వివేక హత్యకు దారితీసిందన్న అనుమానాలు ఉన్నాయి. అవే అనుమానాలు వ్యక్తం చేస్తూ షర్మిల సైతం సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారని టాక్ నడిచింది. ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఆమె తప్పకుండా కడప నుంచి బరిలో దిగుతారని వార్తలు వస్తున్నాయి.
కడప జిల్లా వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి నేడు జగన్ వరకు ఆ కుటుంబం పట్టు నిలుపుకుంటూ వస్తోంది. అందుకే షర్మిల అడుగులతో కడపలో కొత్త చర్చకు తెర తీసినట్టు అయ్యింది. కడప జిల్లాలో ఏ ఇద్దరు కలిసినా రాజన్న బిడ్డ షర్మిల పోటీ చేస్తుందా? అని చర్చించుకోవడం కనిపిస్తోంది. ఒకవేళ షర్మిల పోటీ చేస్తే వైసిపి వ్యూహం ఎలా ఉంటుందోనన్న చర్చ అయితే బలంగా వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో షర్మిలపై సొంత కుటుంబ సభ్యులను జగన్ బరిలో దింపరని.. అదే చేస్తే వైఎస్ వివేక హత్య నేపథ్యం మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగని సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని సైతం పక్కకు తప్పిస్తారని టాక్ నడుస్తోంది.
జిల్లాలో జమ్మలమడుగు తో పాటు మైదుకూరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను జగన్ మార్చనున్నట్లు తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయిస్తారని సమాచారం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా డాక్టర్ సుధీర్ రెడ్డి ఉన్నారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డిని ఎదుర్కోవాలంటే.. వైఎస్ కుటుంబ సభ్యులు అయితేనే సరిపోతారని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. అటు మైదుకూరు స్థానం విషయంలో సైతం జగన్ పునరాలోచన చేస్తున్నారు.
అన్నింటికి మించి షర్మిల కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తే.. జగన్ ఎలాంటి వ్యూహం అమలు చేస్తారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాజకీయాల్లో సెంటిమెంట్లకు తావు లేదని.. జగన్ దానిని పట్టించుకోరని ఒక ప్రచారం ఉంది. షర్మిలను ధీటుగా ఎదుర్కొనకపోతే అది మొదటికే మోసం వస్తుందని.. అందుకే బలమైన అభ్యర్థిని ఆమెపై దించుతారని.. లేకుంటే అంతకుమించి వ్యూహాన్ని అమలు చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరి.. పగ్గాలు అందుకొని.. కడప లోక్ సభ స్థానానికి పోటీ చేస్తానని సంకేతాలు ఇస్తే అందుకు తగ్గ వ్యూహాలు రూపొందించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే షర్మిల అడుగులు బట్టి జగన్ వ్యూహాలు ఉంటాయని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.