Maharashtra Elections Result 2024 : మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి కూటమి గెలిచింది. షిండే మీద వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టింది. అజిత్ పవార్ బలాన్ని మరోసారి నిరూపించింది. దేవేంద్ర ఫడ్నవిస్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయబోతోంది.. ఇది మాత్రమేనా.. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలను మూటగట్టుకున్న బిజెపికి బూస్ట్ ఇచ్చింది. మోడీషా ద్వయానికి శక్తి ఇచ్చింది. అయితే ఇదే ఫలితం మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటిదాకా తిరుగులేని శక్తిగా ఉన్న శరద్ పవార్ కు ఎర్ర చుక్క పెట్టింది. అంతేకాదు ఠాక్రే శిబిరానికి డేంజర్ సిగ్నల్ ఇచ్చింది.. ఇకపై ఇండియా కూటమిలో చేరే పార్టీలకు.. కాంగ్రెస్ పార్టీతో జతకట్టే పార్టీలకు హెచ్చరిక సంకేతాలు పంపింది.. ఇన్ని కోణాలు ఉన్నాయి కాబట్టే.. కాంగ్రెస్ పార్టీ మహా ఫలితాలపై సైలెంట్ గా ఉంది. సంజయ్ రౌత్ లాంటివాళ్ళు ఏవేవో మాట్లాడుతుంటారు గాని.. మహా ఫలితాల తర్వాత జరగబోయే పరిస్థితి ఏమిటో.. ఎదురయ్యే విపత్తు ఏమిటో రాహుల్ గాంధీకి తెలుసు. అందువల్లే కిమ్మనడం లేదు.
మోహన్ భగవత్ కు కూడా..
మహా ఎన్నికల ఫలితాలు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు కూడా పెద్ద పాఠం. మొత్తంగా చూస్తే సాఫీగా సాగిపోతున్న కాషాయ పడవకు చిల్లులు పెట్టకంటూ జనమే ఇచ్చిన మాండేటరీ రిజల్ట్. ఇక ఈ ఫలితాలతో శరద్ పవర్ చరిత్ర దాదాపుగా తుది అంకానికి చేరుకున్నట్టే. ఆయన కుమార్తె సుప్రియ సులే పార్టీని నిలబెడుతుందా? బలపడేలా చేస్తుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. ఇప్పు డున్న వయసు దృష్ట్యా శరద్ పార్టీని నడిపించలేరు. ఇప్పటికే ఆయన వచ్చే ఎన్నికల్లో నిలబడలేనని చెప్పేశారు. ఇక ఆ పార్టీ గుర్తు అజిత్ పవార్ చీలిక పార్టీకి దక్కింది. మహా ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయి కాబట్టి మిగతా కేడర్ కూడా అజిత్ వైపే వెళ్తారు..అందులో అనుమానం కూడా లేదు. అజిత్ కాబోయే డిప్యూటీ సీఎం.
ఉద్ధవ్ శివసేన దుంప నాశనం
శరద్ పవార్ పార్టీ మాత్రమే కాదు శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) దుంప నాశనం అవుతుంది. ఇప్పటికే పార్టీ గుర్తు, పార్టీ పేరు షిండే సొంతమయ్యాయి. అతనిపట్ల మహారాష్ట్ర ప్రజలు అభిమానాన్ని ప్రదర్శించారు. ఒక్క శాతం కూడా వ్యతిరేకత కనిపించలేదు. ఇక సర్వేలలో దేవేంద్రకంటే షిండే మీదే ప్రజలకు ఆదరణ కనిపించింది. ముంబై లాంటి ప్రాంతాలలో ఆటోవాలాలు షిండే ను తమ వాడిగా చెప్పుకోవడం ఎన్నికల ప్రచారంలో కనిపించింది. ఉద్ధవ్ వైపు ఉన్న కేడర్ మొత్తం ఇప్పుడు షిండే వైపు వెళ్తారు. అంటే మొత్తంగా ఠాక్రే మరింత ఇబ్బంది పడే పరిస్థితి.. షిండే కేంద్రంలోకి వెళ్తాడు కాబట్టి.. ఆల్రెడీ బీజేపీ పెద్దలు సంకేతాలు ఇచ్చారు కాబట్టి.. ఇది మాత్రమే ఉద్ధవ్ కాస్తలో కాస్త ఊరట. అయితే అర్ణబ్ గోస్వామి లాంటివాళ్ళు అజిత్ పవార్ కు ఈసారి డిప్యూటీ సీఎం ఇవ్వకపోవచ్చని అంటున్నారు. అయితే అలాంటి తప్పు బిజెపి చేయకపోవచ్చు. ఎందుకంటే అజిత్ స్థాయి ఏమిటో బిజెపికి తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో అతడు వచ్చాడో తెలుసు. ఇప్పటికిప్పుడు మూలాన మర్చిపోతే వచ్చే నష్టం కూడా ఏమిటో బిజెపికి తెలుసు.. స్నేహ ధర్మానికి బిజెపి చెల్లు చీటీ ఇస్తుందని అజిత్ అనుకోడు. ఒకవేళ అదే జరిగితే బిజెపి క్రెడిబిలిటీ గంగలో కలిసిపోతుంది. ప్రస్తుతం అందుతున్న ఫలితాల ప్రకారం బిజెపి మహాలో 100కు పైగా సీట్లు గెలుస్తుంది.. కాబట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని దేవేంద్రుడికి ఇచ్చి.. మిగతా డిప్యూటీ సీఎం పోస్టును అజిత్ కు ఇచ్చేసి.. షిండే ను కేంద్రంలోకి తీసుకుంటుంది.. ఇప్పటికైతే బీజేపీ పెద్దల మదిలో ఇవే ఆలోచనలు ఉన్నాయి.. ఇవి మారే అవకాశం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే మహా ఇచ్చిన ఫలితం అటువంటిది కాబట్టి..